ఆధునిక కాలంలో విజ్ఞానం అందించిన ఒక దృశ్యరూపం ‘సినిమా’. ఇది మనుషులకో వరం! సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి లలితకళల సమ్మేళనం సినిమా. ఈ కళారూపాన్ని ‘పవర్‌ఫుల్‌ మీడియా’గా గుర్తించిన నాటి సినీనిర్మాతలు, దర్శకులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే సాధనంగా మార్చారు. సినిమా ఒక కళేకాదు. నాటినుంచి నేటివరకు సమాజంలోని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని, చైతన్యాన్ని అందించవలసిన దీపిక.

 

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నిటికీ ‘‘ప్రేమ’’ కథావస్తువు. దానిచుట్టూరా కథ తిరుగుతుంది. దేశంలో ఎన్నో సమస్యలుండగా వాటిని స్పృశించటం లేదు రచయితలు. పదవ తరగతికి రాక పూర్వమే ఈనాటి పిల్లలు ప్రేమలో పడిపోతున్నారు. పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి – వీటిమీద నేడు సినిమాలు నిర్మితం కావటంలేదు. ఇక సినిమా రిలీజుకి ముందునుండే అసభ్యకరమైన వాల్ పోస్టర్స్ ద్వారా యువతని పెడదారి పట్టిస్తుంది ఈ సినిమా. 

 

ఆధునిక యుగంలో కళాపోషణకు సినిమా రంగం బలమైన సాధనంగా పరిణమించింది. కానీ, ఈ పరిశ్రమ ప్రారంభమైన తొలిదశల్లో కనిపించిన విలువలు కొంతకాలం తరువాత క్షీణించడం మొదలయింది. వ్యాపారానికి ప్రాముఖ్యత పెరిగి, జనాకర్షణ నెపంతో, చౌకబారు సంగీతమూ, జీవంలేని సాహిత్యమూ అందులో ప్రవేశించాయి.. ప్రస్తుతం సినిమాలలో చూపిస్తున్న అసభ్యకరమైన దృశ్యాలను ఆదర్శంగా, ప్రేరణగా తీసుకొని చాలాచోట్ల విద్యార్థులు తమ తమ కళాశాలల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంగతి మనం నిత్యం చూస్తున్నాం..

 

దర్శకేంద్రులు, దర్శక రత్నలు, నటసామ్రాట్‌, ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారాలు అందుకున్న కవులు, రచయితలు గల తెలుగు సినీరంగానికి ‘‘తెగులు’’, ‘‘చీడ’’ పట్టుకున్నాయి. వ్యాపార ధోరణి అధికం కాగా, గాడితప్పి సినిమా ముందుకు ‘‘జారి’’ పోతుంది. సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి నేటి సినిమాలు. మార్పు సహజమే, అనివార్యమే. కానీ, శుభదాయకమైన మార్పుకాదిది. ఆరోగ్యదాయకమైనది కూడా కాదు. రంకుతనాన్ని, సెక్స్‌ని ప్రచారం చేసే సాధానాలుగా నిలిచిపోతున్నాయే తప్ప, నేటి సినిమాల వల్ల ప్రయోజనమేమీ కన్పించడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: