ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అన్ని రంగాల మీద తీవ్రం ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే వ్యాపారరంగాలు కుదేలవ్వగా తాజాగా సినీ రంగం మీద కూడా ఈ వైరస్‌ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చైనాలో పదుల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో బాధితులు కనిపిస్తుండటంతో చాలా దేశాల్లో ఎంటర్‌టైన్మెంట్‌ రంగం కూడా కుదేళ్లయింది. ముఖ్యంగా చైనాలో థియేటర్లు మూతపడటంతో బాక్సాఫీస్‌ మీద తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

 

ఇండియన్‌ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా చైనా చాలా పెద్ద మార్కెట్. అత్యధిక సంఖ్యలో థియేటర్లు ఉన్న చైనాలో సినిమాలు రిలీజ్ చేస్తే భారీగా వసూళ్లు వస్తాయి. అందుకే ఇప్పుడు హాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాల రిలీజ్‌ విషయంలో పునరాలోచనలో పడ్డారు. చైనాలో రిలీజ్ కాకపోతే వసూళ్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అందుకే పరిస్థితులు సద్దుమణిగాక రిలీజ్ చేద్దామని ఆలోచిస్తున్నారట.

 

ఈ ప్రభావం ఇండియన్ సినిమాల మీద కూడా కనిపిస్తోంది. ఇటీవల కరోనా వైరస్‌ కారణంగా నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న వైల్డ్‌ డాగ్‌ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు మరికొన్ని సినిమాల షూటింగ్‌లు కూడా వాయిదా పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది.

 

ఇండియాలో కేరళలో రెండు కరోనా కేసులు నమోదు కావటంతో అక్కడ జరగాల్సిన షూటింగ్లు వాయిదా పడుతున్నాయి. తాజాగా కేరళలో జరగాల్సిన మరో సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. తెలుగమ్మాయి శోభితా దూళిపాల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె గృహిణిగా కనిపించనుంది. వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోనీ స్కూృవాలా నిర్మిస్తున్నారు.

 

ఇప్పటికే చైనాలో ఎంటర్‌టైన్మెంట్‌ రంగం పూర్తిగా స్తంభించిపోగా.. ఇప్పుడు ఇతర దేశాల మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. త్వరలో చాలా దేశాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: