నటరత్న ఎన్టీఆర్ హీరోగా 1977 లో తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన యమగోల సినిమా అప్పట్లో ఎంత పెద్ద ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ సరసన జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యముడిగా సత్యనారాయణ, చిత్ర గుప్తుడిగా అల్లు రామలింగయ్య, ప్రతినాయకుడిగా రావుగోపాల రావు నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నేడు పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. నిజానికి ఈ సినిమా మొదట ఎన్టీఆర్ గారి కోసం కాకుండా ఆయన కుమారుడైన బాలకృష్ణ కోసం కథ రాసుకున్నారట. 

 

అప్పటి దర్శకనిర్మాత అయిన సి.పుల్లయ్య గారు తెలుగులో ‘దేవాంతకుడు’ పేరుతో ఎన్టీఆర్, కృష్ణకుమారి తో సినిమా తీశారు. ఆ సినిమాకు రచయిత నరసరాజు గారు, ఒకానొక సందర్భంలో దానికి సీక్వెల్‌ తీద్దామని ‘యమగోల’ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేయించి, పుల్లయ్యగారు మరో రచయితను కూర్చోబెట్టి కొంత కథ రాయించారట. అది సగంలో ఉండగానే పుల్లయ్య గారు హఠాత్తుగా మరణించారు. అనంతరం ఆయన కుమారుడు, దర్శకుడైన సిఎస్‌ రావు, అదే కథపై మరికొంత వర్క్‌ చేసి పూర్తి స్క్రిప్టు తయారుచేశారట. నిజానికి దేవాంతకుడు సినిమాలో ఓ సామాన్యుడు డబ్బున్న అమ్మాయిని ప్రేమించడం హీరోయిన్ తండ్రికి నచ్చదు. 

 

అయితే తమ ప్రేమ విజయం కోసం అతను రకరకాల వేషాలు వేస్తాడు. చివరకు ఆమె తండ్రి నియమించిన రౌడీల చేత చంపబడ్డ అతని ఆత్మ యమలోకానికి వెళ్లి, అక్కణ్నుంచి స్వర్గానికి వెళ్లడం, ఆపై చివరకు అదంతా కల అని తేలడం జరుగుతుంది. ఇతను చచ్చిపోయాడని భ్రమపడి హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకోబోతుంది. ఇతనికి మెలకువ రాగానే ఆమెను రక్షించి, పెద్దల అనుమతితో పెళ్లాడతాడు. నరసరాజు గారు ముందుభాగం కథ కాస్త తగ్గించి, యమలోకం సీన్లయ్యాక, యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి అవస్థలు పడినట్లు, వాళ్లని హీరో మామగారు తన నేరకార్యకలాపాలకు ఉపయోగించుకుందామని చూసినట్లు పొడిగించి కొత్త సినిమా తయారు చేద్దామని అన్నారు. 

 

అది మాత్రమే కాక, హీరో యమలోకిని వెళ్లి అక్కడ యముడి అనుమతితో మళ్ళి భూలోకానికి రావడం, ఆపై అతడి కోసం యముడు, చిత్ర గుప్తుడు ఇక్కడి రావడం జరుగుంతుంది. ఆ సందర్భంలో కథ మంచి హ్యూమర్ గా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఈ కథ మొత్తం సిద్ధం చేసి ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్లి వినిపించి, మీ అబ్బాయి బాలకృష్ణ అయితే దీనికి సరిపోతాడు అని అడిగారట. ఒకరోజు సాయంత్రం సినిమా కథ మొత్తం విన్న ఎన్టీఆర్, ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది, నేను హీరోగా చేస్తాను, బాలకృష్ణ ప్రస్తుతం చదువుకుంటున్నాడు అతడు నటించడం వీలుపడదు అని అన్నారట. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా జయప్రదను, యముడిగా కైకాలను తీసుకుందాం అని చెప్పారట. అంతే, అదే క్షణంలో ఆ సినిమాకు బీజం పడడం, ఆ విధంగా బాలకృష్ణ చేయవలసిన యమగోల, ఎన్టీఆర్ చేయడం జరిగిపోయాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: