ఇండియాలో భారీ దర్శకులు అనగానే బాక్సాఫీస్ ఠక్కున చెప్పే పేర్లు రాజమౌళి, శంకర్. సౌత్ సినిమా ఇండియన్ స్క్రీన్ పై భారీగా చూపించిన ఈ దర్శకులను చూసి ట్రేడ్ మార్కెట్ కూడా పండుగ చేసుకుంటోంది. వీళ్ల సినిమాలతో ఖుషీ చేసుకోవాలనుకుంటోంది. అలాంటి వసూళ్ల పండుగను ఇవ్వడానికే కలిసికట్టుగా వస్తున్నారు దర్శకధీరులు. 

 

రాజమౌళి సినిమా అంటే చాలు బాక్సాఫీస్ ఊహల్లోకి వెళ్లిపోతోంది. బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటుంది. ఆ ఊహలను మరింత పెంచుతూ ట్రిపుల్ ఆర్ ని రెడీ చేస్తున్నాడు జక్కన్న. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 8న రిలీజ్ కాబోతోంది. 

 

రాజమౌళి కంటే ముందే బాలీవుడ్ లో ఓ ఊపు ఊపేసిన దర్శకుడు శంకర్. తమిళ సినిమాలతో హిందీ ఆడియన్స్ ని మెప్పించిన ఈ దర్శకుడు ఇప్పుడు ఇండియన్ 2 తీస్తున్నాడు. రోబో తర్వాత కొంచెం స్లో అయిన శంకర్ఇండియన్ 2తో భారీ హిట్ ని టార్గెట్ చేస్తున్నాడు. కమల్ హాసన్, కాజల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాడట శంకర్. 

 

రాజమౌళి, శంకర్ సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే తెలుగు, తమిళ పరిశ్రమల్లో పండుగ సంబరాలు ఓ రేంజ్ కు వెళ్తాయని చెప్పొచ్చు. పైగా టాలీవుడ్, కోలీవుడ్ లో సంక్రాంతికి ప్రత్యేక స్థానముంది. ఈ సీజన్ లో వచ్చిన సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తాయని ట్రేడ్ పండితులు కూడా చెబుతుంటారు. మరి 2021 పొంగల్ కు రాబోతున్న ఈ చిత్రాలు జాయింట్ గా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తాయో చూడాలి. మొత్తానికి రాజమౌళి అటు శంకర్ ల కన్ను వచ్చే సంక్రాంతిపై గట్టిగా పడింది. ఎలాగైనా ఈ సారి తమ టాలెంట్ అంతా చూపించి వెండితెరపై మెరుపులు మెరిపించడంతో పాటు.. భారీగా వసూళ్లు రాబట్టాలని డిసైడయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: