సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి మహేష్ కు 40 కోట్ల పారితోషికంగా ముట్టింది అన్నవార్తలు వినిపించాయి. ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ అవ్వడంతో ఇప్పుడు అల్లు అర్జున్ తాను భావిష్యత్తులో ఒప్పుకునే సినిమాలకు 40 కోట్ల పారితోషికం కావాలి అని అడుగుతున్నట్లు టాక్. 


‘పింక్’ రీమేక్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పారితోషికంగా 50 కోట్లు తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో నటిస్తున్న చరణ్ జూనియర్లకు ఆ సినిమా బిజినెస్ లో షేర్ ఉన్న నేపధ్యంలో వీరిద్దరికీ ఈమూవీ ద్వారా చెరొక 50 కోట్లు వస్తాయి అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ప్రభాస్ కూడ ఆ రేంజ్ పారితోషికం ఉంటేనే సినిమాలు చేసే ఆలోచనలు చేస్తున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక టాప్ హీరోతో సినిమా తీసే నిర్మాతలకు హీరో పారితోషికంతో పాటు దర్శకుడు హీరోయిన్ ల పారితోషికాలు కలుపుకుంటే సుమారు 70 కోట్ల వరకు కేవలం వీరి ముగ్గురి పారితోషికాలే చేరిపోవడంతో టాప్ హీరోలతో సినిమాలు అంటే నిర్మాతలు భయపడిపోతున్నట్లు టాక్. వాస్తవానికి ‘శ్రీమంతుడు’ మూవీ తరువాత మహేష్ కు రియల్ హిట్ లేదు. పవన్ కళ్యాణ్ కు ‘అత్తారింటికి దారేది’ తరువాత నిజమైన హిట్ లేదు. అయినప్పటికీ వీరిద్దరి పారితోషికం ఆకాశాన్ని అంటుతూనే ఉంది. 


ఇదే సంక్రాంతి రేసుకు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ అయినా బన్నీ నటించే అన్ని సినిమాలు ఆ స్థాయి హిట్ అవుతాయి అన్న గ్యారెంటీ లేదు. లేటెస్ట్ గా రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీకి సంబంధించి అతడికి 108 కోట్ల పారితోషికం ముట్టింది అన్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘దర్బార్’ మూవీని కొనుక్కుని నష్టపోయి రోడ్డు మీద పడ్డ అనేకమంది బయ్యర్లు తమ గోడును రజినీకాంత్ కు చెప్పుకుందామని అతడిని కలుద్దామని ప్రయత్నిస్తున్నా అతడు ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో టాప్ హీరోలు అంతా తమకు అవసరం అయినప్పుడు మాత్రమే అందరికీ అందుబాటులోకి వస్తూ తమకు అవసరం లేనప్పుడు ఎవరినీ కలవకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ అటు నిర్మాతలతో పాటు బయ్యర్లకు వారితో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్న వారికి చుక్కలు చూపించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని అడుగులు వేస్తున్నారు అంటూ ప్రస్తుతం వీరి ప్రవర్తన పై కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: