కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ల జాబితాను చూసి ఆశ్చర్యపోవడం ఓటర్ల వంతవుతోంది. గతంలోలాగానే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వలన ఏకంగా సినీతారల ఫోటోలు, పేర్లు కనిపిస్తున్నాయి. తాజాగా కర్నూలులో స్టార్ హీరో వెంకటేష్ ఫోటో కనిపించటం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 
 
కర్నూలు నగరపాలకసంస్థ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఒక మహిళా ఓటరుకు బదులుగా స్టార్ హీరో వెంకటేష్ చిత్రం ప్రచురితమైంది. కర్నూలులో 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరోలుగా ఉండగా వయస్సు 20గా నమోదైంది. ఓటర్ల జాబితాలో స్టార్ హీరో వెంకటేష్ ఫోటో ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఓటర్ల జాబితాలో ఇలాంటి తప్పులు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. 
 
ఇలాంటి తప్పులు చూసిన తరువాత ఎన్నికల కమిషన్ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎటువంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని చెబుతూనే తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రాజమండ్రి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దీపికా పదుకొనె, కాజల్ అగర్వాల్ ఫోటోలు కనిపించాయి. 
 
ఇలాంటి ఘటనల వలన ఎన్నికల కమిషన్ పనితీరు గురించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారి ఓటర్ల జాబితా విడుదలైనప్పుడు ఇలాంటి చిన్నచిన్న తప్పులు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు నగర పాలక అధికారులను ఓటర్ల జాబితాలో వెంకటేష్ ఫోటో గురించి వివరణ కోరగా ఎన్నికలకు చాలా సమయం ఉందని ఓటర్ల జాబితాలో తప్పులు ఏవైనా ఉంటే ఆ తప్పులను సరిచేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వెంకటేష్ కు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం వెంకటేష్ కర్నూలుకు వచ్చి ఓటేస్తారా...? అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: