ప్రేక్షకులు ఏ సినిమాను హిట్‌ చేస్తారో.. ఏ సినిమాను పక్కన పెట్టేస్తారో ఎవరూ చెప్పలేరు. సినీ రంగంలో సక్సెస్‌ అనేది ఎవరికీ సొంతం కాదు. ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చిన దర్శకులు డిజాస్టర్‌లతో నిరాశపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఫార్ములాకు బ్రేక్‌ చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. 20 ఏళ్ల కెరీర్‌లో రాజమౌళి తెరకెక్కించింది కేవలం 10 సినిమాలు మాత్రమే. కానీ ఆ పది సినిమాలు సూపర్‌ హిట్‌లే కావటం విశేషం. టాలీవుడ్‌లో మరే దర్శకుడి సాధ్యం అరుదైన ఘనత ఇది.

 

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి తమ్ముడైన రాజమౌళి, ఇప్పుడు జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అన్న కీరవాణి రికమండేషన్‌తో ముందుగా రాఘవేంద్ర రావు నిర్మించిన పలు సీరియల్స్‌కు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. తరువాత అదే బ్యానర్‌లో శాంతినివాసం సీరియల్‌కు దర్శకుడిగా మారాడు. రాజమౌళి వర్కింగ్‌ స్టైల్‌ దర్శకేంద్రుడు ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్‌ 1 సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.

 

అయితే ఈ సినిమా క్రెడిట్‌ అంతా రాఘవేంద్ర రావు అకౌంట్‌లోకే వెళ్లింది. తరువాత రెండో ప్రయత్నంగా తెరకెక్కిన సింహాద్రి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో రాజమౌళి కెరీరే కాదు ఎన్టీఆర్‌ కెరీర్‌ కూడా మలుపు తిరిగింది. తరువాత వరుసగా సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర సినిమాలను తెరకెక్కి తన రేంజ్‌ను ఒక్కో మెట్టు ఎక్కించుకుంటూ వచ్చాడు.

 

అయితే తన మీద ప్రేక్షకుల్లో పెరుగుతున్న అంచనాలను కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో సునీల్ హీరోగా మర్యాదరామన్న అనే చిన్న సినిమాను రూపొందించాడు. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్ రాజమౌళి జైత్ర యాత్రన కొనసాగించింది. తరువాత ఈగ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి.

 

ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి రేంజ్ మాత్రమే కాదు తెలుగు సినిమా రేంజ్‌ తారా స్థాయికి చేరింది. మన మేకర్స్‌ కూడా హాలీవుడ్ స్థాయిలో సినిమాలు రూపొందించగలరని ఈ సినిమాతో నిరూపించాడు జక్కన్న. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ మరో అద్భుతాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: