కోలీవుడ్ హీరో విజయ్ టార్గెట్‌గా కొద్ది రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్‌తో పాటు ఆయన చిత్రాల నిర్మాతలు, ఫైనాన్సియర్ల మీదకూడా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపించని సొమ్ము పట్టుబడినట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా విజయ్‌ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు 300 కోట్ల విలువైన స్థిరాస్తి పత్రాలు పట్టుబడినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే విజయ్‌ని పలుమార్లు ఐటీ అధికారులు విచారించారు.


ఈ సోదాల్లో విజయ్ నివాసంతో పాటు, బిగిల్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ నివాసంలో దాదాపు రూ 77 కోట్ల డబ్బుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది.  అక్రమ నగదుపై నటుడు విజయ్ కి అధికారులు సమన్లు జారీ చేశారు.


తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా విజయ్‌కు ఐటీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే ప్రస్తుతం తాను విచారణకు హాజరు కాలేనని విజయ్‌ అధికారులకు సమాచారమిచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తాను మాస్టర్ సినిమాలో షూటింగ్‌లో ఉన్నందున, విచారణకు హాజరయ్యేందుకు కొంత సయమం కావాలనే కోరనున్నాడని తెలుస్తోంది. ఇటీవల బిగిల్ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు విజయ్‌. ఈ సినిమా దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం స్టార్‌ హీరో లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటిస్తున్నాడు.


అయితే ఈ దాడుల వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్టుగా విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో మెర్సల్ సినిమాలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్‌ చెప్పిన డైలాగ్‌లు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి అశాంల మీద విజయ్‌ కామెంట్స్‌ బీజేపీ పార్టీకి కోపం తెప్పించాయి. ఇప్పుడు ఆ కక్షతోనే విజయ్‌ని ఇబ్బందులు పాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: