మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడిలు ఈ సంక్రాంతికి ఒకేసారి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు సాధించారు. అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో తెరకెక్కించిన త్రివిక్రమ్‌, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఇద్దరు మాటల రచయితలుగా సత్తా చాటి తరువాత దర్శకులుగా మారిన వారే. అయితే ఈ ఇద్దరి మూలంగా మరో ఇద్దరు దర్శకుల కెరీర్‌ పాడైందన్న అపవాదు కూడా వీరి మీద ఉంది.

 

ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్లు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు విజయ భాస్కర్‌. స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు విజయ భాస్కర్‌. అయితే ఈ సినిమాల సక్సెస్‌లో మాటలు కీలక పాత్ర పోషించాయి. త్రివిక్రమ్‌ మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకుంది ఈ సినిమాలతోనే. అయితే దర్శకుడిగా మారాలనుకున్న త్రివిక్రమ్‌, విజయ్‌ భాస్కర్‌ సినిమాలకు సంభాషణలు అందించటం మానేశాడు. దీంతో విజయ్‌ భాస్కర్‌ను వరుస పరాజయాలు పలకరించాయి. ఒకప్పుడు వరుస విజయాలు అందించిన విజయ భాస్కర్‌ ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు.

 

యంగ్ సెన్సేషన్‌ అనిల్ రావిపూడి కూడా మాటల రచయితగా చాలా సినిమాలకు పనిచేశాడు. స్టార్ హీరోలతోనూ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన శ్రీనువైట్ల దగ్గర చాలా సినిమాలకు సంభాషణలు అందించాడు. శ్రీనువైట్ల టీంలో అనిల్‌ ఉన్నన్ని రోజులు సూపర్‌ హిట్‌లు వచ్చాయి. కానీ దర్శకుడిగా పటాస్‌ సినిమాకు అవకాశం రావటంతో ఆగడు సినిమా సమయంలో శ్రీను టీం నుంచి బయటకు వచ్చాడు అనిల్‌. దీంతో అప్పటి నుంచి శ్రీనువైట్ల కెరీర్‌ కష్టాల్లో పడింది. ఆగడుతో మొదలైన ఫ్లాప్‌లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగి శ్రీనువైట్లకు ప్రస్తుతం హీరోలే దొరకటం లేదు. తమ ప్రమేయం లేకపోయినా ఇలా త్రివిక్రమ్‌, అనిల్ ఇద్దరు మరో దర్శకుడి కెరీర్‌ దెబ్బతినటంలో కారణమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: