శ్రీకాంత్ తన సహచర నటి, హీరోయిన్ ఊహ అలియాస్ శివరంజని అలియాస్ ఉమ‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. చిత్రమేంటంటే.. శ్రీకాంత్ తన సినిమా కెరీర్‌లో ఎన్నో ప్రేమకథలలో నటించాడు. నటించడమే కాకుండా ఆయా చిత్రాల్లో.. తనదైన శైలిలో పాత్రలకు జీవం పోసి ఎంతోమంది అమ్మాయిల హృదయాల్ని కొల్లగొట్టాడు. ఈ క్రమంలో మనం కూడా శ్రీకాంత్ నిజ జీవితంలో ఊహతో ఎప్పుడు ప్రేమలో పడ్డాడు? ఎలా తన మనసులోని మాటని బయటపెట్టాడు? వంటి విషయాలు తెలుసుకుందాం.. 

 

శ్రీకాంత్, ఊహ.. వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు. అయితే వీరు తొలిసారిగా కలిసి నటించిన చిత్రం మాత్రం 'ఆమె'. ఈ చిత్రం ద్వారానే ఊహ తెలుగు చిత్రపరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైంది. అలాగే ఆమె శ్రీకాంత్ జీవితంలోకి ప్రవేశించడానికి కారణం కూడా ఈ చిత్రమే. ఆమె చిత్రం ముహూర్తపు షాట్‌లోనే తొలిసారిగా వీరు ఒకరినొకరు చూసుకున్నారట. అలా ఏర్పడిన వారి పరిచయం.. ఆ తర్వాత స్నేహంగా మారింది. అదే స్నేహం ఇద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది. కానీ ఎంత స్నేహితులైనా.. ఈ ఇద్దరు కూడా తమ ప్రేమని ఒకరితో మరొకరు పంచుకోలేదు. 

 

కానీ ఓ సందర్భంలో.. శ్రీకాంత్ తన రియల్ లైఫ్‌లో కూడా.. హీరోలాగే డేరింగ్, డ్యాషింగ్‌‌గా ఊహ ఇంటికి నేరుగా వెళ్లి ప్రపోజ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారట. వారి ప్రేమకథకే ఇది ఓ హైలైట్ సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికి.. అది వారే అప్పటికి ఇంకా పంచుకోలేదు. అటువంటిది శ్రీకాంత్ నేరుగా ఊహ ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు.. వాళ్ళ తల్లిదండ్రులని, ఊహని దేవుడగదిలోకి పిలిచి 'నేను తనని ప్రేమిస్తున్నాను.. అలాగే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను' అని చెప్పి తన మెడలోని బంగారు గొలుసు తీసి ఆమె మెడలో వేసాడట. 

 

ఈ ఊహించని పరిణామానికి అందరూ షాక్ అయినప్పటికి .. అందులో నుండి బయటకి వచ్చి అందరూ వీరి ప్రేమని అంగీకరించారు. కానీ శ్రీకాంత్ ఈ షాక్ ఇవ్వకముందే.. ఊహ తల్లిదండ్రులు తనకి పెళ్లి సంబంధాలు చూశారట. ఈ ప్రపోజల్ తెలిసాక ఆ సంబంధాలు అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. శ్రీకాంత్ కూడా ఆ తర్వాత.. తన ఇంటిసభ్యులకు ఇదే స్టైల్‌‌లో సూటిగా తాను ఊహని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. తొలుత ఇది సాధ్యపడుతుందా లేదా..? అని ఆలోచించినప్పటికి వారు కూడా వీరిద్దరి ప్రేమని అంగీకరించి పెళ్ళికి పచ్చ జెండా ఊపడం గమనార్హం.  జనవరి 20, 1997 తేదిన ఈ ప్రేమికులు.. ఆలుమగలుగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: