భారతీయ సంగీత రంగంలో ప్రముఖుడిగా పేరొందిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా ఇటీవల ఇచ్చారు. వేద పాఠశాల నిమిత్తం తన గృహాన్ని బాల సుబ్రహ్మణ్యం ఇవ్వడం జరిగింది. సొంత ఊరు నెల్లూరులోని తిప్పరాజు వారి వీధి లో ఉన్న తన గృహాన్ని కంచి పీఠానికి వేద పాఠశాల నిర్వహణకు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉచితంగా ఇవ్వటం ఇప్పుడు ఇండస్ట్రీలో మరియు ఏపీ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మంగళవారం రాత్రి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం స్వయంగా కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు శంకర విజయం ఆంధ్ర సరస్వతి శంకరాచార్య స్వామి కి తన సొంత గృహాన్ని లాంఛనంగా సమర్పించారు.  

 

ఎస్పీ బాలు తండ్రి సాంబమూర్తి పేరిట ఈ పాఠశాల నడప బోతున్నారు. సొంత ఇంటిని వేదపాఠశాల నిమిత్తం కంచి పీఠానికి అందజేసిన నిమిత్తం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ….‘‘మా తండ్రిగారు పెద్ద శైవభక్తులు. గురుభక్తితో ఉండే వారు. వారులేరనే అసంతృప్తి తప్ప వారిపేరుతో వేద పాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తాం. కంచి పీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదు.. భగవత్‌ సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబు’’ అని అన్నారు. ఇదే సందర్భంలో ఆ తరువాత  కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి మాట్లాడుతూ.. ‘‘భిక్షాటన పూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన ఘనత ఎస్పీ సాంబమూర్తికే దక్కుతుంది.  

 

నెల్లూరు వీధుల్లో భగవన్నామ సంకీర్తనను మారుమోగించిన ప్రతిభాశాలి సాంబమూర్తి. దేశంలో వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాలను, సంగీత, సాహిత్యాలను పరిరక్షించుకునే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. సంగీతం, భక్తి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి సాంబమూర్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ స్థలంలో వేదనాద ప్రచారాన్ని కొనసాగిస్తాం’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవటంతో నెటిజన్లు గాయకుడు గానే మా హృదయాలను దోచుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం.. తాజాగా మరింతగా మంచి పని చేసి వేద పాఠశాల కోసం సొంత ఇంటిని త్యాగం చేసి ఆయనపై మరింత గౌరవం పెరిగేలా వ్యవహరించారని పొగుడుతున్నారు. మరికొంతమంది మీకు చేతులెత్తి దండం పెట్టాలి చాలా గొప్ప పని చేశారు..అంటూ ప్రశాంసలు కురిపిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: