అక్కినేని నాగార్జున - అతన్ని అందరూ మన్మథుడిగా పిలుస్తుంటారు. ఎందుకంటే, 60 దాటుతున్నా, అచ్చెరువొందే అందం అయన సొంతం. అలాగే 'కింగ్'గా కూడా ఆయన పేరు అభిమానులకు సుపరిచితం. ఈ స్టార్ హీరో తన సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు చూశాడు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా.. చిన్న వయసులోనే అనేక ఎత్తుపల్లాలని అతిదగ్గరగా చూశాడు.  పెళ్లి చేసుకున్న తరువాత హీరోగా కెరీర్ ప్రారంభించిన.. అతికొద్దిమంది కథానాయకులలో నాగార్జున ఒకరు.

 

శివ, గీతాంజలి చిత్రాలు నాగార్జునకు ఒక స్టార్ హోదాను కట్టబెట్టాయి. అలాగే సహచర నటి అమల రూపంలో.. నాగ్కు ఒక మంచి స్నేహితురాలు కూడా దొరికింది.  'కిరాయి దాదా' చిత్రంతో ప్రారంభమైన వీరి స్నేహం.. క్రమంగా 'శివ' చిత్రం విడుదల అయ్యేసరికి.. ఒకరంటే ఒకరికి ఇష్టంగా అర్ధమైంది. తెలుగులో అమల.. ఎక్కువగా నాగార్జున చిత్రాలలోనే నటించడం విశేషం. అయితే అప్పటికే ఒకసారి వివాహబంధంలో విఫలమవ్వడంతో.. అమలతో తన జీవిత ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అడుగులు వేశారు నాగ్. 

 

ఇదే క్రమంలో ఆయన అమలతో  పెళ్లికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అప్పటికే నాగార్జున వ్యక్తిత్వంతో పాటు.. తనపై ఆయన చూపిస్తున్న ప్రేమను గురించి తెలిసిన ఆమె.. తన అంగీకారాన్ని తెలపడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక ఈ నిర్ణయాన్ని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కూడా కాదనలేదు. తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే సమర్థత.. నాగ్కు ఉందని ఆయనకు తెలుసు. అందుకే నాగార్జున - అమల.. వీరిరువురి పెళ్లికి తన అంగీకారాన్ని ఆయన ఆనందంగా తెలియచేశారు. 

 

వీరి వివాహం పెద్దలు, సన్నిహితుల సమక్షంలో 1992లో నిరాడంబరంగా జరిగింది. వీరిరువురికి కలిగినే సంతానమే అఖిల్. తను 1994లో జన్మించారు. ఎప్పుడైతే నాగార్జునని పెళ్లి చేసుకున్నారో.. అప్పటి నుండి అమల తన సినీ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె నాగార్జునకి అన్ని విషయాల్లోనూ వెన్నెముకగా నిలిచింది. ఆ సమయంలోనే ఆమె జంతువుల సంరక్షణ కోసం "బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్"ని ఏర్పాటు చేసింది. అలాగే సామాజిక సేవా రంగంలో కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: