ఆయన చేసిన సినిమాలే ఆయన పేరుని ప్రపంచవ్యాప్తం చేశాయి... చేస్తూనే ఉంటాయి. అయితే తన విజయాల్లో ఆయన కుటుంబ పాత్ర  కూడా విస్మరించరానిది. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడంటే.. ఆ చిత్రానికి వెన్నుముకగా ఉండేది ఆయన కుటుంబమే. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఆయన భార్య రమా రాజమౌళి. రాజమౌళి చిత్రాలలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె పోషించిన పాత్ర ఎంతో కీలకం.

 

మరి టాలీవుడ్ జక్కన్నగా పేరుగాంచిన ఆ వ్యక్తికి.. సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్న రమ.. రాజమౌళి జీవితంలోకి ఎలా ప్రవేశించిందో చాలామందికి తెలీదు. అసలు వారి ప్రేమ, వివాహం గురించిన వివరాలు కూడా పెద్దగా ఎవరికి తెలియవు. ఈ క్రమంలో మనం కూడా వారి ప్రేమకథ ఎలా పుట్టిందో? వారి పెళ్లికి దారి తీసిన కారణాలేమిటో? తెలుసుకుందామా

 


రాజమౌళి, రమల వివాహ బంధం ఎంతో ఆదర్శమైంది. ఎందుకంటే, రాజమౌళితో రమకి వివాహం కాక మునుపే.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పలు భేదాభిప్రాయాలతో ఆ దంపతులు విడిపోగా.. రమ తన కొడుకు కార్తికేయతో కలిసి ఒంటరిగా నివసించడం గమనార్హం. 

 

ఆ సమయంలోనే రాజమౌళికి రమతో  పరిచయం కావడం.. ఆ బంధం క్రమంగా స్నేహంగా.. ప్రేమగా మారి ఆ తరువాత ఇరువురు పెళ్లి చేసుకోవడానికి దారి తీసింది. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే - రమ సొంత చెల్లెలు కీరవాణి భార్య వల్లి కావడం విశేషం. రాజమౌళి కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగానే.. ఆమెకు తనతో తొలిసారిగా స్నేహం ఏర్పడింది. రమా, రాజమౌళిల వివాహం కూడా చాలా నిరాడంబరంగా జరిగింది. రాజమౌళి అన్న కీరవాణి చేతుల మీదుగా.. ఆయన ఇంట్లోనే ఆ వివాహం జరిగింది.

 

రమ, రాజమౌళిల ప్రేమకథని తెలుసుకున్న తరువాత ..కచ్చితంగా ఇది ఒక ఆదర్శ ప్రేమకథ అని మీరు కూడా భావిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా.. ఈ ఆదర్శ జంటకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: