అల్లరి చిల్లరి చలాకి పిల్ల సమంత.. కుదురుగా.. మృదువుగా ఉండే అబ్బాయి నాగచైతన్య. ఈ జంట టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ అనే సంగతి అందరికి తెలిసినదే. ఇద్దరినీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వీరిని చూస్తే ఇద్దరూ వేర్వేరు కాదు.. ఒక్కటే అనిపిస్తుంది. అందుకే అభిమానులు వారిద్దరినీ కలిపి 'చైసామ్' అని పిలుస్తుంటారు. వారిద్దరినీ చూస్తే కొన్నిసార్లు అసూయ కూడా కలుగుతుంది. అంత అన్యోన్యంగా ఉంటారిద్దరూ. అందుకే రిలేషన్ షిప్ విషయంలో నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారిద్దరూ. 

 

వీరిద్దరి మధ్య ప్రేమను చూస్తే మనకూ అలాంటి భాగస్వామి కావాలనిపిస్తుంది. తొమ్మిదేళ్ల క్రితం ఏ మాయ చేశావే సెట్లో నాగ చైతన్య, సమంత కలుసుకొన్నారు. అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం ప్రేమగా మారడానికి మాత్రం ఎనిమిదేళ్లు సమయం పట్టింది. ఈ మధ్య కాలంలో ఇద్దరూ తమ జీవితంలో ఎత్తుపల్లాలను, జయాపజయాలను చవి చూశారు. 2014లో ‘ఏమాయ చేశావే’ అంటూ సమంత చేతిని అందుకొన్నాడు నాగచైతన్య. 

 

2018 అక్టోబర్ 7న అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలతో ‘మనం’ అంటూ ఒక్కటయ్యారు. వీరి ప్రణయ ప్రయాణంలో అందమైన మజిలీలెన్నో. సాధారణంగా హీరోహీరోయిన్ల మధ్య చిగురించిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదనే అభిప్రాయం జనాల్లో ఉంది. అలాంటి ఉదాహరణలను సైతం మనం ఎన్నో చూశాం. కానీ చై సామ్ దీనికి పూర్తిగా భిన్నం. రోజులు గడిచే కొద్దీ వారిద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. అందుకే నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యువతరానికి రిలేషన్ షిప్ గోల్స్ నిర్దేశిస్తున్నారు.

 

అలాగే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరి తెర కాంబినేషన్స్ కి ఉన్న క్రేజే వేరు. వీళ్లిద్దరు తొలిసారి 'ఏమాయ చేసావే' చిత్రంలో కలిసి పనిచేసారు. ఈ సినిమాకి సమంతకి మొదటి సినిమాకాగా, నాగ చైతన్యకు రెండో సినిమా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా అలరించారు. ఆ తర్వాత మనం, ఆటో నగర్ సూర్య చిత్రాలలో కలిసి నటించారు. ఇక పెళ్లి అనంతరం మజిలీ అనే సినిమాలో కలిసి నటించిన సంగతి అందరికి తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి: