మనిషి ఊపిరి తో పాటే ప్రేమ పుట్టింది మరొక విధంగా చెప్పాలంటే ప్రేమ పుట్టిన తరువాత మనిషి పుట్టాడు. అందుకే మనిషికంటే ప్రేమ ప్రాచీనమైనది. సింధు నాగరికత సమయం నుండి ప్రేమ కథలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. వాస్తవానికి ఆకర్షణ వేరు ప్రేమ వేరు అయితే నేటి తరంలో చాలమంది తమ మధ్య ఉన్న ఆకర్షణను ప్రేమ గా భావిస్తున్నారు. నిజమైన ప్రేమలో స్వార్థం కనిపించదు. భౌతికమైన కోరికలతో ముడిపడి ఉన్నది నిజమైన ప్రేమ కాదు. అందుకే ప్రేమ అజరామరమైంది అని అంటారు. 

ప్రతి సంవత్సరం ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఈ వాలెంటైన్స్ డే సంస్కృతి మన భారతీయ సంస్కృతి కాదు. ఈ పద్ధతి రోమన్లది ఫిబ్రవరి 14ను రోమన్లు శుద్ధీకరణ పండుగగా జరుపుకునేవారు. అలా కొంతకాలానికి ఈ పండుగ  ప్రణయోత్సవంగా మారిపోయింది. ఆ రోజున యువతీ యువకులు కలుసుకుని అమ్మాయిల పేర్లను చీటీలమీద వ్రాసి ఒక డబ్బాలో వేసి డ్రా తీసిన తర్వాత ఒక అబ్బాయికి ఏ అమ్మాయి పేరు వస్తుందో ఆ రోజు అంతా కలిసి విచ్చలవిడిగా తిరిగే పద్ధతి ఉండేది. సాధారణంగా ఇలాంటి జంటలు అప్పట్లో పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఈ పండగను నేడు పాశ్చాత్యులు ‘వాలెంటైన్ డే’గా పరిగణిస్తూ ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. 


అసలు ఈరోజుకు వాలంటైన్ అనే పేరు దీనికి పెట్టడానికి వెనుక పెద్ద కారణం ఒకటి ఉంది. క్రీ.శ. 270వ సం.లో ప్రేమకోసం ప్రాణాలను త్యాగం చేసిన వాలెంటైన్ అనే ప్రేమికుడి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రేమికుల దినోత్సవంగా ఈరోజును పరిగణిస్తారు. రోమన్ చక్రవర్తి అయినటువంటి 2వ క్లాడియస్ తన దేశంలో పెళ్లిచేసుకున్న యువకులు ఉన్నట్లయితే యుద్ధంలో ఏకాగ్రతగా ఉండరని భావించి పెళ్లిళ్ళు చేసుకోకుండా నిషేధించాడు. కానీ వాలంటైన్ అనే ఆదేశ పౌరుడు ఆ శాసనాన్ని ధిక్కరించి ప్రేమికుల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రేమ వివాహాలు జరిపించేవాడు. ఈ విషయం రోమన్ చక్రవర్తి తెలియడంతో వాలెంటైన్‌కు శిరచ్ఛేద శిక్ష విధించడం జరిగింది. తనకు మరణకాలం సమీపిస్తున్నకొద్దీ వాలెంటైన్ తాను శిక్ష అనుభవించే జైలు కిటికీలోనుంచే తన గదివైపు ఉన్న చెట్టుకొమ్మకు ఉన్నటువంటి పూలపై ‘వాలెంటైన్‌ ను గుర్తుంచుకో’ అనే అక్షరాలను తన యొక్క రక్తంతో రాసి జైలర్ కూతురికి ఇచ్చాడు అన్నది చారిత్రక కథనం.


అయితే ఇప్పుడు ఆ వాలెంటైన్స్ డే ఒక ఫ్యాషన్ గా మారిపోయి దానికి కార్పోరేట్ కంపెనీల వ్యాపారం కూడ తోడు కావడంతో కేవలం ఈ ఒక్కరోజున మన ఇండియాలో గిఫ్ట్స్ బిజినెస్ 15 బిలియన్ డాలర్లు స్థాయిలో జరుగుతుందని ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రేమలో వ్యాపార దృక్పదం జమా ఖర్చులు ఉండవు. ఎదుటి వ్యక్తికి ఇచ్చే ఖరీదైన బహుమతులు ఆడంబరాన్ని చాటుతాయి కాని నిజమైన ప్రేమను గెలుచుకోలేవు. నిజమైన ప్రేమ ఒక గులాబి పూవుతో కూడ తెలియచేయవచ్చు అన్న విషయాన్ని యువత తెలుసుకోగలిగితే నిజమైన ప్రేమ కాలక్షేపం కాదు అన్న నిత్యసత్యాన్ని గుర్తించ గలుగుతారు. నిజమైన ప్రేమ జంటకు ప్రతిరోజు వాలెంటైన్స్ డే గానే భావించాలి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: