బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసులోనూ యంగ్ జనరేషన్‌కు పోటి ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ఈ టాప్ హీరోకు ప్రాణాలిచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో సల్మాన్ క్రేజ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. తాజాగా సల్మాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రూవ్ చేసే సంఘటన ఒకటి జరిగింది.
అస్సాంకు చెందిన ఓ అభిమాని సల్మాన్ కోసం ఏకంగా 600 కి. మీలు సైకిల్ తొక్కి గౌహతి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. భూపెన్ లిక్సన్ అనే 52 ఏళ్ల సైకిలిస్ట్ సల్మాన్ కోసం ఓ సాహసం చేశాడు. ఏకంగా 600 కి. మీలు సైకిల్ తొక్కి సల్మాన్ పాల్గొనబోయే సినిమా కార్యక్రమ వేదికకు చేరుకున్నాడు. ఫిబ్రవరి 15న గౌహతిలో జరగనున్న ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకకు సల్మాన్ ఖాన్ హాజరవుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న భూపెన్ తన అభిమాన నటుడి కోసం ఏదైన గొప్పగా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సైకిల్ మీద పయనమయ్యాడు. ఫిబ్రవరి 8న తన స్వగ్రామం టిన్ సుకియా నుంచి బయలు దేరిన భూపెన్ 13న గౌహతి చేరుకున్నాడు. అయితే ఈ సాహసం చేసిన భూపెన్ సాధారణ వ్యక్తేం కాదు. ఆయన సైకిలిస్ట్‌గా ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లోనూ స్థానం సంపాదించుకున్నాడు.
గతంలో 48 కిలో మీటర్ల దూరాన్ని సైకిల్ హ్యాండిల్ పట్టుకోకుండా 60 నిమిషాల్లో చేరుకున్నాడు. ఇప్పుడు అదే భూపెన్ సల్మాన్ కోసం 600 కిలో మీటర్లు సైకిల్ మీద ప్రయాణించి సల్మాన్ పాల్గొనే ఫిలింఫేర్ అవార్డ్స్ వేదిక కు చేరుకున్నాడు.మరి ఈ అభిమానిని సల్మాన్ కలుస్తాడో లేదో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ప్రస్తుతం రాధే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.