విజయ్ దేవరకొండ హీరోగా మళ్లీ మళ్లీ ఇది రానిరోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కే ఎస్ రామారావు నిర్మించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. నటన పరంగా విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నా సినిమాలో చాలా సన్నివేశాల్లో విజయ్ పాత్ర అర్జున్ రెడ్డి పాత్రను గుర్తుకు తెస్తుంది. నలుగురు హీరోయిన్లు సినిమాలో ఉన్నప్పటికీ ఐశ్వర్య రాజేష్, రాశీఖన్నాలకు మాత్రమే చెప్పుకోతగ్గ పాత్రలు దక్కాయి. 
 
సినిమా ఫ్లాప్ అవుతుందని విజయ్ దేవరకొండకు ముందే తెలుసా...? అందుకే విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో  నిర్లక్ష్యం వహించాడా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా రిలీజ్ కు ముందు తనదైన శైలి పబ్లిసిటీ ద్వారా సినిమాపై భారీగా అంచనాలు పెంచేసేవాడు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడంలోనే విజయ్ ఫెయిల్ అయ్యాడు. 
 
విజయ్ హీరోగా నటించిన గత చిత్రం డియర్ కామ్రేడ్ సినిమాకు తొలిరోజు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా విడుదలకు ముందు విజయ్ భారీగా పబ్లిసిటీ కార్యక్రమాలు చేసి అంచనాలు పెంచటంతో తొలిరోజు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ కు మాత్రం బుకింగ్స్ ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ డియర్ కామ్రేడ్ తొలిరోజు కలెక్షన్లను క్రాస్ చేస్తుందా...? అనే ప్రశ్నకు కష్టమే అని సమాధానం వినిపిస్తోంది. 
 
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి బయటకు వస్తే మంచిదని లేదంటే మాత్రం సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ కథ, కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ క్లాసిక్ గా నిలిచిపోయేది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో విజయ్ కెరీర్లో మరో డిజాస్టర్ చేరినట్టే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: