తెలుగు ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్ గా పిలుచుకునే హీరో డాక్టర్ రాజశేఖర్.  కెరీర్ బిగినింగ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అంకుశం చిత్రంతో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు.  టాలీవుడ్ లో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలీ అనేవిధంగా రాజశేఖర్ చిత్రాలు ఉండేవి.  ఇదే తరహా చిత్రాలు ఎక్కువ రావడంతో కాస్త ట్రెండ్ మార్చి అల్లరి ప్రియుడు చిత్రంలో రొమాంటిక్ హీరోగా నటించాడు.  ఆ తర్వాత ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించిన ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి.  దాంతో చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

 

ఆ మద్య గరుడ వేగ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ మంచి సక్సెస్ సాధించాడు. తర్వాత కల్కి తో పరవాలేదు అనిపించుకున్నాడు. తాజాగా  డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘అర్జున’. ఈ చిత్రానికి  కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి అందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ.. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి, రిలజ్ డేట్ ప్రకటిస్తాం అని చెప్పారు. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారని అన్నారు.

 

ఈ చిత్రం ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టే విధంగా ఉంటుందని.. ఒక సామాన్య రైతు తనయుడు సీఎం స్థాయికి ఎలా ఎదిగాడు... ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. అన్నదే ఈ చిత్ర కథ అన్నారు. సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ.. అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరింపచేస్తుందని చెప్పారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్‌గా, హృదయానికి హత్తుకునేలా ఉండాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: