హీరో తర్వాత ఓ సినిమాకు ఆయా కాంబినేషన్లు తీసుకొచ్చే క్రేజ్ మరేదీ తీసుకురాదు. ఫలానా కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగిపోతూంటాయి. అవి హీరో హీరోయిన్లు, హీరో -  దర్శకుడు, హీరో బ్యానర్ కావొచ్చు. ఈకోవలకే హీరో సంగీత దర్శకుడు కూడా వస్తారు. టాలీవుడ్ లో అలాంటి క్రేజీ కాంబోల్లో మహేశ్ మణిశర్మ కూడా వస్తారు. మహేశ్ హీరోగా చేసిన తొలి సినిమా నుంచి పన్నెండేళ్ల పాటు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి.

 

 

1999లో రాజకుమారుడు దగ్గర నుంచి 2010లో వచ్చిన ఖలేజా వరకూ వీరిద్దరి జర్నీ కొనసాగింది. ఆ తర్వాత ఓ దశాబ్దం పాటు వీరిద్దరి కాంబోలో సినిమానే రాలేదు. మహేశ్ వరుసగా సినిమాలు చేస్తూ దేవీశ్రీ ప్రసాద్ ను ఎంకరేజ్ చేశాడు. మధ్యలో థమన్, మిక్కీ జే మేయర్ తో సినిమాలు చేశాడు కానీ మణిశర్మకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు.. ఇన్నేళ్లకు వీరిద్దరూ కలవబోతున్నారని మహేశ్ 27వ సినిమాకు మణిశర్మే సంగీతం అందించబోతున్నాడని ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది. ముఖ్యంగా మహేశ్ సినిమా అంటే మణిశర్మ ప్రత్యేకంగా పనిచేసి మంచి సంగీతం ఇచ్చేవాడని పేరు కూడా పడ్డాడు.

 

 

ఓదశలో వరుసగా బాబీ, అర్జున్, అతడు, పోకిరి సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. ఖలేజాలో సదాశివా.. సన్యాసి.. పాట ఇప్పటికీ ఓ అద్భుతం అనే చెప్పాలి. సినిమాకు సంగీతం ఎంత ముఖ్యమో.. హీరోలకు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మణిశర్మ ఈ విషయంలో ఆరితేరిపోయాడనే చెప్పాలి. చిరంజీవి నుంచి చరణ్ వరకూ అలాంటి సంగీతం ఇవ్వడంలో మణిశర్మ దిట్ట. అయితే.. మహేశ్ 27కు మణిశర్మతో పాటు మరో మ్యూజిక్ డైరక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. మణిశర్మకు మహేశ్ ఛాన్సిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: