ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు మరణించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వర్‌రావు(70) గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వర్ రావు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి  11 గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పరమేశ్వర్‌రావు మృతితో శ్రీకాంత్‌ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియడంలో మెగాస్టార్ చిరంజీవి తన సన్నిహితుడైన శ్రీకాంత్ నివాసానికి వెళ్లారు. మేకా పరమేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి ఆపై శ్రీకాంత్ తో మాట్లాడారు.

 

మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. తండ్రిని కోల్పోయిన విషాదంలో ఉన్న శ్రీకాంత్ ను ఓదార్చారు. అంతకుముందు, చిరంజీవిని చూడగానే శ్రీకాంత్ భావోద్వేగాలకు లోనై ఆయనను హత్తుకున్నారు. ఆ సమయంలో మరో హీరో గోపీచంద్ కూడా అక్కడే ఉన్నారు. శ్రీకాంత్ తండ్రి అంత్యక్రియలను ఈ మధ్యాహ్నం హైదరాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. అలాగే ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, పరమేశ్వరరావు 1948 మార్చి 16వ తేదీన కృష్ణా జిల్లా మేకా వారి పాలెంలో జన్మించారు. 

 

అయితే ఆ తర్వాత కాలంలో ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వలస వెళ్లారు. బసవపాలెంలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు. ధర్వాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీకాం డిగ్రీ పూర్తిచేసిన శ్రీకాంత్.. తర్వాత సినిమాలపై మక్కువతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లోమా చేశారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు.  వన్ బై టు హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఇక ఆ తర్వాత వచ్చిన తాజ్ మహల్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: