ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ షాకిస్తున్నారు. అప్పుడెప్పుడో 2018లో వ‌చ్చిన అజ్ఞాత‌వాసి సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ప‌వ‌న్ సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసి రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయాడు. ఆ సినిమా త‌ర్వాత కంప్లీట్ గా రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేసిన ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీతో గ‌తేడాది ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.

 

ప‌వ‌న్ పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో పాటు తాను ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ రెండు చోట్ల కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి మొఖానికి రంగేసుకున్నాడు. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇచ్చాడో లేదో ఒకేసారి ఏకంగా నాలుగు సినిమాలు ప‌ట్టాలు ఎక్కించాడు. ముందు `పింక్‌` రీమేక్‌ని మొద‌లుపెట్టిన ఆయ‌న తాజాగా క్రిష్ డైరెక్ష‌న్‌లో పిరియాడిక‌ల్ ఫిల్మ్ లో కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

తెలంగాణ రాబిన్ హుడ్‌గా చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిన పండుగ‌ల సాయ‌న్న క‌థ‌ని క్రిష్సినిమా ద్వారా తెర‌పైకి  తీసుకు వ‌స్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముందు ప్లానింగ్ ప్ర‌కారం ఈ సినిమా కోసం తాజ్ మ‌హ‌ల్‌, చార్మినార్ సెట్‌ల‌తో పాటు ఓ వాట‌ర్ ఫాల్ సెట్‌ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ రు.50 కోట్లు, బ‌డ్జెట్ రు. 50 కోట్లు అనుకున్నార‌ట‌. అయితే ఇప్పుడు బ‌డ్జెట్ మ‌రో రు.30 కోట్లు పెర‌గ‌డంతో నిర్మాత ర‌త్నం బ‌డ్జెట్‌లో బాగా కోత‌లు పెట్టేస్తున్నార‌ట‌.

 

కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `విరూపాక్ష‌` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. ఏదేమైనా బ‌డ్జెట్ ఓవ‌ర్ అయినా ప‌వ‌న్ సినిమాకు తేడా వ‌స్తే ఏం జ‌రుగుతుంది అన్న‌ది అజ్ఞాత‌వాసి, కాట‌మ‌రాయుడు, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలే చెప్పేశాయి. అందుకే నిర్మాత మ‌రీ గుడ్డిగా న‌మ్మి మున‌గ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: