బాహుబలి లాంటి భారీ విజయం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నభారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న జక్కన్న ఈ సినిమాను అంతుకు మించి అనే స్థాయిలో రూపొందిస్తున్నాడు. దాదాపు 5 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ అల్లూరి సీతా రామ రాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.

 

క్రేజీ కాంబినేషన్‌, భారీ బడ్జెట్, రాజమౌళి మార్క్‌ ఇలా అన్ని కలిసి ఆర్ ఆర్ ఆర్‌ పై భారీ క్రేజ్‌ ఏర్పడింది. అందుకే సినిమా సెట్స్‌ మీద ఉండగానే బిజినెస్ కూడా భారీ రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకోగా, తాజాగా డిజిటల్‌ రైట్స్‌ కూడా అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. కేవలం డిజటల్‌ రైట్స్‌తోనే సినిమా బడ్జెట్‌లోనే సగం కంటే ఎక్కువ వెనక్కు వచ్చేసినట్టే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా దాదాపు 260 కోట్ల ధర పలికినట్టుగా తెలుస్తోంది. సౌత్‌లో గతంలో ఏ సినిమాకు ఈ స్థాయిలో ధర పలకలేదు.


పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ హీరోయిన్ అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. హిందీ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్ కీలక పాత్రలో నటిస్తుండగా తమిళ నటుడు సముద్ర ఖని మరో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ముందుగా సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలని భావించినా నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమాను 2021 జనవరి 8కి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: