కన్నడ నాట  ప్రముఖ నటి లీలావతికి ఎంత పేరు ఉందో తెలిసిందే.  ఆమె స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు.  తాజాగా నటి లీలావతికి చెందిన తోటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టేకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని.. కానీ ఈ సారి మాత్రం ఆస్తి నష్టం తీవ్ర స్థాయిలో జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటన నెలమంగల తాలూకాలోని సోలదేవనహల్లిలో ఉన్న ఈ తోటకు సమీపంలో జరిగింది.  అయితే అక్కడ  ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లీలావతి కుమారుడు, వర్ధమాన నటుడు వినోద్ ఆరోపించారు.

 

కొంత కాలంగా ఆమె తనయుడు వినోద్ కన్నడ నాట హీరోగా నటిస్తున్నాడు.  తమను టార్గెట్ చేసుకొని కొంత మంది చేస్తున్న దుశ్చర్య అని..  దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  కాగా తమను టార్గెట్‌ చేసి కొంతకాలంగా రకరకాల సమస్యలు సృష్టించి వేధిస్తున్నారని ఇటీవల నటి లీలావతి ఆరోపించిన నేపథ్యంలో ఈ అగ్నిప్రమాదం సంభవించడం గమనార్హం.   పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. అంతలోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

గతంలో కూడా లీలావతి తోటలో కొంతమంది కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పపడ్డారని.. అప్పట్లో నష్టం వచ్చినా.. ఈసారి వచ్చినదంగా ఘోరంగా రాలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.  కెరీర్ పరంగా తనకు మంచి పేరు ఉందని.. తన తనయుడు కూడా హీరోగా రాణిస్తున్నారని.. కొంత మంది గిట్టని వారు తమను భయభ్రాంతులు సృష్టించాలని ఇలాంటి పనులు చేస్తున్నారని.. ఇప్పటికైనా నింధితులను పట్టుకొని సరైన శిక్ష పడేలా చేయాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: