భారతీయ చలన చిత్రం రంగంలో శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ ఓ సెన్సేషన్ విజయం అందుకుంది.  దేశంలో పెరిగిపోతున్న లంచగొండి తనంపై ఓ మాజీ స్వాతంత్ర పోరాట యోధుడు ఎలా తిరగబడ్డాడు.. చివరికి తన సొంత కొడుకును లంచం తీసుకున్నాడని తెలుసుకొని ఎలా చంపాడు అన్న ఇతివృత్తంతో అప్పట్లో ఈ చిత్రం ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకుంది.  చాలా కాలం తర్వాత ఈ చిత్రం సీక్వెల్ గా ఇండియన్ 2 రూపొందుతుంది.  స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్, కాజల్ జంటగా తెరెక్కుతున్న ‘ఇండియన్ 2’ మొదటి నుంచి ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా చెన్నయ్‌ సమీపంలోని పోనమలై (నాసరత్‌పేట్‌) వద్ద భారతీయుడు-2 షూటింగ్‌లో బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

 

షూటింగ్‌కు ఉపయోగించే 150 అడుగుల క్రేన్‌ ఇనుపవైరు తెగిపోవడంతో ఒక్కసారిగా నేలకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయిన వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్లర్లు.. ఒక లైట్ బాయ్ ఉన్నారట.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్నారు.  డైరెక్టర్‌ శంకర్‌తో సహా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.  కమలహాసన్‌పై చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కమల్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అయితే, ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే షాక్‌ నుండి కోలుకున్న కమల్‌హాసన్‌ సహాయక చర్యలో నిమగమైనట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.

 

గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.  అయితే ఈ విషయంపై కమల్ హాసన్ ఎంతో బాధపడుతూ.. నా జీవితంలో ఎప్పుడు ఇంతటి విషాదాన్ని చూడలేదని భావోద్వేగానికి గురయ్యారు.  భారీ క్రేన్ విరిగిపడడంతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఓ లైట్ బాయ్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మరణించారు. ఈ ముగ్గురి మృతికి   కమలహాసన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: