టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా పునాదిరాళ్లు నుంచి మొన్నటి సైరా నరసింహారెడ్డి వరకు కెరీర్ పరంగా ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. ఇక ఒక్కో సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా, తన ఇమేజ్ ని పేరుని, మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు సాగిన మెగాస్టార్, తన సినిమాల ద్వారా ఎన్నో గొప్ప రివార్డులు, రికార్డులు, అవార్డులు అందుకున్నారు. ఇక థియేటర్లోకి మెగాస్టార్ సినిమా వస్తుంది అంటే, ఆయన అభిమానులకు అది అతి పెద్ద పండుగ అని చెప్పవచ్చు.  ఇక మొదటి నుంచి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం గల మెగాస్టార్, తనతో పాటు పనిచేసే వారిలో, అలాగే తనకు తెలిసిన వారిలో ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, వెంటనే చలించి పోవడంతో పాటు వారికి తన వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పేరుతో కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సేవలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

 

ఇటీవల కొద్ది రోజుల క్రితం ప్రముఖ సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు హఠాన్మరణంతో ఎంతో దిగ్భ్రాంతి చెందిన మెగాస్టార్ చిరంజీవి, ఆ వార్త తెలియగానే ఆయన ఇంటికి వెళ్లి రామారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక అంత్యక్రియల సమయంలో ఒక లక్ష రూపాయల సాయం అందించిన మెగాస్టార్, వారి కుటుంబానికి మరింత బాసటగా నిలిచేలా కొంత భారీ మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ, రామారావుగారు కుటుంబ సభ్యులకు ప్రతినెల అందేలా మెగాస్టార్ ఏర్పాటు చేయనున్నారట. అలానే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రామారావు కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించనున్నారట. 

 

అలానే జర్నలిస్ట్ యూనియన్ వారు కూడా ఒక ఆరు లక్షలు, అలానే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు శివాజీ రాజా ఒక ఐదు లక్షల రూపాయల చెక్కును రామారావు కుటుంబానికి అందించనున్నట్లు సమాచారం. అయితే తనకు మొదటినుంచి ఎంతోమంది జర్నలిస్టుల తో పరిచయం ఉన్నప్పటికీ, రామారావు గారితో మాత్రం ఎంత ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అలానే ఎప్పటికప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తూ, మా ఇంట్లోనే సభ్యుని వలె కలిసిమెలిసి ఉండే రామారావు గారు ఈరోజున మన మధ్యన లేకపోవడం నిజంగా బాధాకరమని, అందుకే ఈ విధంగా తన వంతుగా వారి కుటుంబానికి ఎంతో కొంత సహకారం అందించాలని సంకల్పించారట మెగాస్టార్. ఇక ఆయన చేస్తున్న ఈ గొప్ప పని పై టాలీవుడ్ తో పాటు పలువురు ప్రజలు సైతం ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: