మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల నటించిన డిస్కోరాజా సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. రవితేజ ఖాతాలో డిస్కో రాజాతో వరుసగా నాలుగో ప్లాప్ పడింది. ఇక ఇప్పుడు తనకు బలుపు, డాన్ శీను లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ మలినేని గోపీచంద్‌ను నమ్మి అతడితో క్రాక్ సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ చూసి ఇదేదో కొత్తగా ఉంటుందనుకుంటున్న వారికి టీజర్ చూడగానే పెద్ద కరెంట్ షాక్ కొట్టినట్లయ్యింది. గతంలో రవితేజ నటించిన బలుపు సినిమా చూశారా.. పోనీ అతడు చేసిన పవర్ లేదా టచ్ చేసి చూడు సినిమాలు చూశారా.. అయితే ఇప్పుడు రిలీజైన క్రాక్ సినిమా టీజర్ మీరు అసలు చూడక్కర్లేదు.. ఎందుకంటే మీ టైం వేస్ట్ అయినట్టే.
క్రాక్ టీజర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది.. ఎంత రొటీన్ ఉందంటే రొటీన్‌కే పెద్ద రొట్ట కొట్టుడు.. ఇంకా చెప్పాలంటే చాలా చెత్తగా ఉందనే అనాలి. ఇప్పటి రోజుల్లో అసలు సినిమాకు జనాలను తీసుకు రావాలంటే ఫస్ట్ లుక్ టైటిల్, పోస్టర్ నుంచే సినిమాపై ఓ రకమైన ఆసక్తిని పెంచాలి. ఇక టీజర్, ట్రైలర్ ఎంత కొత్తగా ఉంటే అంత బాగా జనాలు ఎట్రాక్ట్ అవుతారు. రవితేజను పవర్ ఫుల్ కాప్‌గా చూపించడంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడేమో గాని.. అన్ని షాట్లు పాత సినిమాల్లో మనం చూసేసినవే. సోషల్ మీడియాలో కూడా టీజర్‌ను, రవితేజను ఓ ఆటాడుకుంటున్నారు.
ఇక గతంలో రవితేజ - గోపీచంద్ కాంబోలో బలుపు, డాన్ శీను సినిమాలు వచ్చాయి. అవి కూడా పెద్ద గొప్ప సినిమాలు కాదు.. ఇంకా చెప్పాలంటే అప్పట్లో రవితేజ లక్ బాగుండి.. ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు క్రాక్ సినిమాతో వీళ్లు ఇద్దరు హ్యాట్రిక్ కొడతారు అనుకుంటే టీజర్‌తోనే తుస్సు మనిపించేశారు. సినిమాలో ఏమంత విషయం లేదని టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. ఓ మర్డర్ మిస్టరీ, రివెంజ్ డ్రామా, రవితేజ మేనరిజమ్స్ లాంటి రొటీన్ ఎలిమెంట్స్ తప్ప టీజర్ లో కొత్తగా ఏమీ కనిపించలేదు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజతో నటించడం ఆమెకిది రెండోసారి.