నిర్లక్ష్యమో... ప్రమాదమో.. ముగ్గురు నిండు ప్రాణాలు పోయాయి. చెన్నై నగర శివారు ప్రాంతంలో ఉన్న ఈవీపీ స్టూడియోలో ఇండియన్-2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం ఉపయోగిస్తున్న ఓ భారీ క్రేన్ 150 అడుగుల ఎత్తు నుంచి ఓ టెంటుపై పడింది. ఈ ప్రమాదంలో డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్స్ ఇద్దరు.. ఒక టైట్ బాయ్ చనిపోయారు. భారతీయుడు 2 సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాద ఘటనలో క్రేన్ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ముగ్గురు చనిపోవటానికి కారణమయ్యాడంటూ అతనిపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ? క్రేన్ సడెన్ గా పడిపోవటానికి కారణాలేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం పోలీసులు వెల్లడించటం లేదు. మరోవైపు భారతీయుడు -2 చిత్ర షూటింగ్ సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదంపై ఆ చిత్ర దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌లకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాతతో పాటు.. క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ పేర్లను పొందుపరిచారు.
క్రేన్ ఆపరేటర్ అప్పమత్తరంగా లేకపోవడం వల్లే లైటింగ్ ఏర్పాటు చేస్తున్న క్రేన్ వున్నపలంగా విరిగిపడిపోవడంతో భారీ నష్టం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసు శాఖ దర్యాప్తును చేపట్టి క్రేన్ ఆపరేటర్ని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శంకర్ దర్శకత్వంలో ఒకప్పుడు వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.