సినిమా ఇండస్ట్రీలో హీరోలైనా, దర్శకులైనా హిట్ వస్తే మాత్రమే వారికి క్రేజ్ ఉంటుంది. వరుస ఫ్లాపులు ఇస్తే ఎంతటి హీరో అయినా డైరెక్టర్ అయినా క్రేజ్, మార్కెట్ తగ్గాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఈ విషయంలో దర్శకులతో పోలిస్తే హీరోల పరిస్థితి కొంత బెటర్ గా ఉంటుంది. గడచిన దశాబ్ద కాలంలో స్టార్ డైరెక్టర్లుగా వరుస హిట్లు ఇచ్చిన దర్శకులు ఒకటీ రెండూ ఫ్లాపులు రాగానే అవకాశాలు లేక మరో అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 
 
కొంతమంది దర్శకులు తమ తప్పు లేకపోయినా సినిమాల్లో హీరోల అతి జోక్యం, ఇతర కారణాల వలన కెరీర్ ను ముగించాల్సి వస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ రోజునే ప్రేక్షకులు డిజాస్టర్ అని తేల్చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. 
 
కానీ దర్శకుడు క్రాంతి మాధవ్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ ఓనమాలు సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చినా ఆడియన్స్ పెద్దగా ఈ సినిమాను పట్టించుకోలేదు. ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు దర్శకత్వం వహించాడు. 
 
సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఆ తరువాత సునీల్ తో ఉంగరాల రాంబాబు సినిమా తీయగా ఆ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఫ్లాప్ కావడంతో ఈ దర్శకుడికి ఇప్పట్లో మరో అవకాశం రావడం కష్టమే అని చెప్పవచ్చు. సినిమాలో విజయ్ జోక్యం చేసుకోవడం వలనే సినిమా ఫ్లాప్ అయిందని క్రాంతి మాధవ్ వ్యాఖ్యలు చేయడంతో విజయ్ క్రాంతి మాధవ్ ను ముంచేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: