విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భారతీయుడు 2 ' సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై చెన్నైలోని పూనమళ్లీ పోలీసులు లైకా ప్రొడక్షన్‌ సంస్థపై కేసు నమోదు చేశారు. నిర్మాతతో పాటు క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్‌పై కూడా కేసులు పెట్టారు. IPC సెక్షన్ 287, IPCసెక్షన్ 337, IPC సెక్షన్ 338, IPC సెక్షన్ 304ఎ కింద వివిధ కేసులు నమోదు చేసినట్టు చెన్నై పోలీసులు తెలిపారు.  

 

ఈ విషయం తెలుసుకున్న తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద ఘటనపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కమల్ హాసన్ స్వయంగా మృతిచెందిన వారికి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.  తన సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల కమల్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు తాను ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డానని చెప్పారు. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్ రాజన్, లైకా సంస్థ, ప్రొడక్షన్ మేనేజర్‌తోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు.

 

ప్రమాదం తర్వాత పరారైన క్రేన్ ఆపరేటర్ రాజన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.  తాజాగా, ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేసిన అధికారులు విచారణ అధికారిగా డిప్యూటీ కమిషనర్ (క్రైం) నాగజ్యోతిని నియమించారు. కాగా, సాధారణంగా సినిమా షూటింగ్‌లకు 60 అడుగుల భారీ క్రేన్‌కు మాత్రమే అనుమతులు ఉంటాయి. కానీ, భారతీయుడు 2 కోసం 100 అడుగుల క్రేన్ వాడారు. తాను ఎంత చెప్పినా కెమెరామన్, ప్రొడక్షన్ బృందం పట్టించుకోలేదని క్రేన్ ఆపరేటర్ రాజన్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: