అందాల నటి శ్రీదేవి వర్దంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఆమె సాధించిన విజయాలు, ఆమె పొందిన గౌరవాలతో పాటు ఆమె జీవితంలో జరిగిన కొన్ని వింత సంఘటనలు కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాల, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన శ్రీదేవి, దాదాపు అన్ని భాషల్లోనూ సూపర్‌ స్టార్లతో కలిసి నటించింది.

 

అంతేకాదు ఒక దశలో హీరోలు శ్రీదేవితో నటించేందుకు భయపడేవారట ఆమె ముందు ఎక్కడ తేలిపోతామో అని. 1992లో రిలీజ్‌ అయిన ఖుదా గవా సినిమా షూటింగ్‌ సమయంలో అమితాబ్‌, శ్రీదేవిల మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. ముందుగా ఆ సినిమాలో నటించేందుకు శ్రీదేవి అంగీకరించలేదు. అయితే శ్రీదేవిని ఒప్పించేందుకు అమితాబ్‌ చాలా పెద్ద ప్రయత్నమే చేశాడు. తనతో కలిసి నటించేందుకు అంగీకరించని శ్రీ దేవిని ఒప్పించటానికి ఏకంగా ఓ లారీ లోడ్‌ గులాభీ పూలను పంపించాడట బిగ్ బీ.

 

అప్పట్లో అమితాబ్‌ సినిమాలన్ని ఆయన పాత్ర చుట్టూనే తిరిగేవి. అందుకే బిగ్‌బీతో కలిసి నటిస్తే తనకు పెద్దగా గుర్తింపు రావదన్న ఉద్దేశంతో ఖుదాగవా సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసింది శ్రీదేవి. అయితే ఆ సినిమాలో ఎలాగైన శ్రీదేవిని నటింప చేయాలని భావించిన అమితాబ్‌, శ్రీదేవి షూటింగ్‌లో ఉన్న లోకేషన్‌కు లారీ లోడ్‌ గులాభీలను పంపించాడు.

 

అమితాబ్‌ తనతో నటించేందుకు ఎంతగా ఎదురుచూస్తున్నాడో గ్రహించిన శ్రీదేవి చివరకు ఆ సినిమాలోనటించేందుకు అంగీకరించింది. అంతేకాదు అమితాబ్‌ సినిమాలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటి కూడా శ్రీదేవినే కావటం విశేషం. ఈ సినిమాలో శ్రీదేవి అమితాబ్‌, భార్యగా కూతురిగా రెండు పాత్రల్లో నటించింది. ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్ హీరో నాగార్జున కూడా కీలక పాత్రలో నటించటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: