చిరంజీవి అనగానే అభిమానులకు ఇప్పటికీ డ్యాన్సులు, ఫైట్లే గుర్తుకొస్తాయి. అయితే అదంతా ఫస్ట్ ఇన్నింగ్స్ కే పరిమితం. సెకండ్ ఇన్నింగ్స్ అనగానే వైవిధ్యమే కళ్లముందు కదలాలి అన్నట్టు.. భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. తర్వాత కొరటాలతో కలిసి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు మేకోవర్ అయ్యాడు మెగాస్టార్.  

 

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ని పూర్తి భిన్నంగా బిల్డ్ చేసుకుంటున్నాడు. కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో కమర్షియల్ రైతు సందేశం ఇచ్చిన చిరు, తర్వాతి నుంచి ట్రాక్ మార్చేశాడు. వైవిధ్యమైన కథాంశాలు ఎంచుకుంటున్నాడు. సినిమా సినిమాకు సంబంధంలేని స్టోరీస్ లో నటిస్తున్నాడు. 

 

ఖైదీ నెంబర్ 150తో మాస్ మసాలా కథ చెప్పిన చిరంజీవి.. తర్వాత దీనికి భిన్నమైన కథ ఎంచుకుంటున్నాడు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో సైరాలో నటించాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రజాపోరాటకారుడిగా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

 

సోషల్ మెసేజ్ తో సినిమాలు తీసే కొరటాల శివ ఈ సినిమాను కూడా ఇదే ఫార్మాట్ తో తీస్తున్నాడట. అయితే ఇంతకుముందు సినిమాల్లో మాటలతో సందేశాలు ఇచ్చిన కొరటాల, ఇప్పుడు బంధూక్ పడితేనే బంధవిముక్తులు అవుతారనే లైన్ తో సినిమా తీస్తున్నాడట. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ చిరంజీవి లుక్ కూడా బయటికి వచ్చింది. 

 

చిరంజీవి-కొరటాల శివ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ స్టిల్ లీక్ అయ్యింది. ఈ ఫోటోలో చిరు రెడ్ మఫ్లర్ తో కనిపిస్తున్నాడు. దీంతో చిరంజీవి ఈ సినిమాలో కమ్యూనిస్ట్ తరహా పాత్ర పోషిస్తున్నాడనే టాక్ వస్తోంది. అయితే చిరు ఇంతకుముందు లెక్చరర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడనే టాక్ వచ్చింది. అలాగే రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అంటే చిరు కమ్యూనిజాన్ని ఫాలో అవుతూ.. విద్యార్థులను ఆ దారిలోకి తీసుకెళ్తాడా.. అసలు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: