మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రస్తుతం బాగా స్లంప్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు వరుస డిజాస్టర్లు ఎదుర్కొన్న రవితేజ ఇటీవల వచ్చిన డిస్కో రాజా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జనవరి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు రవితేజ మరో రెండు సినిమలను లైన్లో పెట్టాడు. రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. దీంతో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో ఉన్న రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
తనకు బలుపు, డాన్ శీను లాంటి రెండు హిట్ సినిమాలు ఇచ్చిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగాసాగుతోంది. ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేయగా ఆ టీజర్‌కు కూడా మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. పరమ రొటీన్ మార్క్ పోలీస్ ఆఫీసర్‌గానే రవితేజ పాత్ర ఉందన్నది టీజర్ చూసిన వెంటనే అర్థమవుతోంది. శృతి హాసన్ కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమా విషయంలో రవితేజ కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది. కిక్ సినిమా అదే రోజు రిలీజ్ అయ్యింది.
ఈ రెండు సినిమాల టైటిల్స్ కూడా కెతో స్టార్ట్ అవ్వడంతో ఇది కూడా తనకు కలిసి వస్తుందని రవితేజ భావిస్తున్నాడట. ఇక క్రాక్ తర్వాత రవితేజ తనతో వీర సినిమా చేసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా దానికి కూడా క సెంటిమెంట్ ప్రకారం టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి కిలాడీ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఏదేమైనా రవితేజ ఇలా వరుస పెట్టి క సెంటిమెంట్‌తో ఫాలో అవుతూ టైటిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఈ క... కె సెంటిమెంట్లు రవితేజ కెరీర్‌ను టర్న్ చేస్తాయా ? లేదా ? అన్నది చూడాలి.