టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, హీరోగా పరిచయం అయిన తొలి సినిమా అష్ట చమ్మా నుండి ఒక్కొక్క సినిమాతో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమా లో తొలిసారిగా నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా నటిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూనే ముందుకు పోతున్నారు నాని. ముందుగా ఆయన బ్యానర్ పై ఒక విభిన్న కథాంశంతో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

 

ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న అ సినిమా తరువాత, రెండవ సినిమాగా ప్రస్తుతం ‘హిట్’ ని నిర్మిస్తున్నారు నాని. ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చడం జరిగింది. ఇప్పటికే ఆయన స్వరపరిచిన పాటలకు శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసిందనే చెప్పాలి. 

 

ఇక ప్రేక్షకుల ఈనెల 28న రాబోతున్న తమ ‘హిట్’ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం యూనిట్ సభ్యులందరికీ ఉందని ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నాని చెప్పారు. కె.రాఘవేంద్రరావు, ఎస్.ఎస్.రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా హాజరయిన ఈ వేడుకతో సినిమాకు మరింతగా పబ్లిసిటీ లభించింది. మరి నాని నిర్మిస్తున్న ఈ హిట్ సినిమా, యూనిట్ సభ్యులందరూ భావిస్తున్నట్లు నిజంగానే హిట్ కొట్టేనా అనేది తెలియాలంటే ఈ నెల 28వరకు వెయిట్ చేయాల్సిందే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: