టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పటివరకు వచ్చిన నటుల్లో చాలామంది ఎంతో చక్కగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుని, ఆ తరువాత పారితోషికంగా వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకుని తమ భవిష్యత్తుని అలానే తమ కుటుంబాలను ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడితే, అక్కడక్కడా కొందరు నటులు మాత్రం తమకు వచ్చిన డబ్బును జాగ్రత్త చేసుకోలేక, చివరికి జీవిత అవసాన దశలో ఎన్నో కష్టాలు పడ్డ వారున్నారు. అయితే వారిలో ముఖ్యంగా ఇద్దరు గొప్ప నటులు తమ జీవితాన్ని సరైన ప్రణాళిక ప్రకారం నడపలేక, ఆపై డబ్బు దాచుకోక, చివరికి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఆ ఇద్దరూ మరెవరో కాదు. 

 

ఒకరు చిత్తూరు నాగయ్య, మరొకరు మహానటి సావిత్రి. కొన్నేళ్ల క్రితం సినిమా పరిశ్రమ తొలినాళ్ళలో మంచి పేరుగల నటుడిగా దినదినాభివృద్ధి చెందిన చిత్తూరు నాగయ్య, అప్పట్లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. అంతేకాదు, వినడానికి ఆశ్చర్యం అయినప్పటికీ, ఆరోజుల్లోనే ఏకంగా లక్ష రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడు మన చిత్తూరు నాగయ్య. అంటే ఆ పారితోషికం ఇప్పటి ప్రకారం ఎన్నో కోట్ల రూపాయలకు సమానమాట. అయితే ఆ విధంగా వరుసగా సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ ఎంతో గొప్ప పేరు, కీర్తి ప్రతిష్టలు, ధనము సంపాదించిన నాగయ్యకు ఒక అలవాటు మాత్రం ఉండేదట, అదే విపరీతంగా దాన ధర్మాలు చేయడం. తనవద్దకు వచ్చిన వారికెవరికైనా సరే భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి తమ భవిష్యత్తుని బాగుచేసుకోమని చెప్పేవారట నాగయ్య. 

 

ఆ విధంగా విపరీతంగా దానాలు చేసి, చివరకు ఆఖరి సమయాల్లో సరైన తిండి, వసతి కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడి నాగయ్య మరణించారని ఇప్పటికీ కొందరు సీనియర్ నటులు ఆయన పరిస్థితిని తలచుకుంటూనే ఉంటారు. ఇక మహానటిగా పేరుగాంచిన సావిత్రి కూడా దాదాపుగా అంతే, అప్పట్లో అత్యంత గొప్ప నాయికగా పేరుగాంచిన సావిత్రికి కూడా అప్పట్లో ఎంతో భారీ స్థాయిలో పారితోషికం అందుకునేవారట. ఇక చేతికి ఏమాత్రం ఎముకయినా లేదనే విధంగా ఆమె, తనవద్దకు సహాయం అర్ధించి వచ్చిన ప్రతిఒక్కరికీ ఎంతో గొప్పగా దానాలు చేసేవారని, అలానే ఎంతో కష్టాల్లో ఉన్న మహిళలకు ఆమె బంగారం వంటివి దోసిళ్ళతో పంచారనే వార్తలు ఇప్పటికీ కూడా మన ప్రేక్షకులు మరిచిపోలేరు. 

 

అయితే అటువంటి సావిత్రి ఆ తరువాత అవసాన దశలో కుటుంబ, ఆర్ధిక సమస్యలతో మద్యానికి బానిసై ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆవేదనతో మరణించారు. ఆమె జీవితాన్ని ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. అయితే ఈ ఇద్దరు నటులు కూడా ఎంతో గొప్ప స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా, తోటి వారు కూడా మనవంటి వారే అని భావించి, ఇతరులకు సాయం చేయాలనే గొప్ప భావనతో మంచికి పోయి తమ సర్వస్వము దానధర్మాలు చేసి ఆపై తమకంటూ ఏమి లేకుండా చేసుకుని చివరికి ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినప్పటికీ నేడు వారు మన మధ్యన లేకపోయినా, వారు చేసిన ఆ గొప్ప మంచి పనులు మన మనసుల్లో ఎప్పటికీ చెరగని ముద్రవేసుకుని ఉంటాయి అనే చెప్పాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: