మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఇరుకున పడబోతున్నారు. ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తారట. ఇంతకీ ధర్నా చేసేవారు.. ఏ సినీరంగానికి చెందిన వారో కాదు.. లేకపోతే.. ఏదైనా రాజకీయ పార్టీ వాళ్లో కాదు.. మరి ఇంకా ఎవరంటారా..? ఈసారి ధర్నా చేస్తానంటున్నది మాత్రం అమరావతి రైతులు.. అవును.. రాజధానిని అమరావతి నుంచి తరలించ వద్దంటున్న అమరావతి రైతులు.. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలనుకుంటున్నారు.

 

 

అయితే తాము ఇంతగా పోరాడుతున్నా సినీ రంగానికి చెందిన వారు ఎవరూ స్పందించక పోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. అందుకే సినీ రంగానికి షాక్ ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్లు మెగాస్టార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రులకు ఒకటే రాజధాని పేరుతో ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఈ మేరకు ఓ సంచలన ప్రకటన చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు దీక్షకు దిగుతామని ప్రకటించింది. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి ముందు ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.

 

 

రాజధాని రైతులకు, మహిళలకు, రైతు కూలీలకు చిరంజీవి మద్దతు తెలపాలని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ కోరింది. అమరావతి మద్దతుదారులు తమ దీక్షకు సంఘీభావం తెలపాలని.. దీక్షను జయప్రదం చేయాలని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఆమేరకు వీరు చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియా బాగా తిరుగుతోంది. అయితే అమరావతి ఉద్యమంలోకి సినీ రంగ ప్రముఖులను లాగాలనే ప్రయత్నం ఇంతకు ముందు కూడా జరిగింది.

 

 

గతంలో ఫిల్మ్ చాంబర్స్ ముందు కూడా అమరావతి జేఏసీ నేతలు ధర్నా చేశారు. మరోసారి ఇతర నటుల ఇళ్ల ముందు కూడా ధర్నాకు ప్రయత్నించారు. ఇక ఇప్పుడు చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తే ఉద్యమానికి పాపులారిటీ వస్తుందని జేఏసీ నేతలు భావిస్తున్నారు. మరి ఈ ధర్నా కార్యక్రమం పట్ల మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: