నటనలో ఆయనో లెజెండ్.. సినిమాల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు బహుశా మరే నటుడూ చేసుండరు. అందుకే కమల్‌ హాసన్‌ విశ్వనటుడయ్యారు. అయితే ఆయన పేరు ఎప్పుడూ.. ఏదో ఒక వివాదంలో.. వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాత ముద్దు వివాదం.. మళ్లీ కమల్‌ పేరు వివాదాల్లో లాగింది.

 

ఇప్పుడైతే కొత్తగా సినిమాల్లో ముద్దు సన్నివేశాల గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి గానీ... దశాబ్దాల క్రితమే హీరోహీరోయిన్ల లిప్‌కిస్‌ ఎంత ఘాటుగా ఉంటుందో.. సినీ ఇండస్ట్రీకి చూపించాడు కమల్‌ హాసన్‌. డెబ్భైలు, ఎనభైల్లోనే హీరోయిన్ల అదరాలను చుంబించి... సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాల్లో లిప్‌లాక్‌లు సర్వసాధారణమయ్యాయి. 

 

తన విలక్షణమైన నటనతో యూనివర్సల్‌ హీరో ట్యాగ్‌ సొంతం చేసుకున్న కమల్‌ని చుట్టుముట్టిన వివాదాల సంఖ్య అంతా ఇంతా కాదు. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి వచ్చాక.. అవి మరింత ఎక్కువయ్యాయి. భారతీయుడు 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయనకు.. ఆ సినిమా సెట్టులో క్రేన్‌ కూలిన ఘటనలో పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం మరిచిపోకముందే.. ప్రస్తుతం మరో వివాదంలో కమల్ పేరు వినిపిస్తోంది. 

 

ఒకనాటి తమిళ హీరోయిన్‌ రేఖ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్సే కొత్త వివాదానికి కారణం. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  1986లో బాలచందర్ రూపొందించిన పున్నగాయ్ మన్నన్ సినిమాలో రేఖ, కమల్ హాసన్ జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. అయితే ఆ ముద్దు సన్నివేశం గురించి తనకు దర్శకుడు ముందుగా చెప్పలేదని.. తన అనుమతి లేకుండానే కమల్ తనకు ముద్దు పెట్టేశారని.. తాజాగా ఆ ఇంటర్వ్యూలో రేఖ చెప్పడం కలకలం రేపింది. 

 

ఆ సినిమాలో సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు.. ఒక్కసారిగా కమల్ తనకు ముద్దు పెట్టేశారని చెప్పింది రేఖ. ఆ క్షణంలో తనకేం అర్థం కాలేదని, అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టడం కోపం తెప్పించిందని వివరించింది. షూటింగ్ అయిపోయాక బాలచందర్ దగ్గరకు వెళ్లి అడిగితే.. అందులో ఎలాంటి అసభ్యతా లేదంటూ బదులిచ్చారని పేర్కొంది. ఆ ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు తనకు నిద్ర పట్టలేదని, అదో పీడకలలా వెంటాడిందని ఆవేదన వ్యక్తం చేసింది రేఖ. అయితే ఆ తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉండడంతో.. ఆ విషయాన్ని మరిచిపోయానని చెప్పింది. 

 

రేఖ ఇచ్చిన ఈ ఇంటర్వూపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రేఖకు కమల్ క్షమాపణ చెప్పాలంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ముద్దు పెడితే ఇప్పుడు సారీ చెప్పాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే .. దీనిపై విలక్షణ నటుడు కమల్‌ హాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి..! 

మరింత సమాచారం తెలుసుకోండి: