స్టార్ హీరోలు ఇక నుంచి ఎప్పుడు పడితే అప్పుడు కనిపించరు. ఈ పెద్ద హీరోల సినిమాలు చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి.. దసరా.. సమ్మర్ వస్తే తప్ప స్టార్స్ థియేటర్స్ లోకి అడుగుపెట్టరు. వీళ్ల సినిమాలకు.. సెలవులకు సంబంధం ఏమంటారా.. చాలా పెద్ద కనెక్షనే ఉంది. 

 

రిలీజ్ విషయంలో పెద్ద హీరోలందరూ ఒకే మాట మీదున్నారు. సెలవుల్లో తప్ప మామూలు రోజుల్లో థియేటర్స్ కి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ హీరోలందరీ ఒకటే రీజన్. మినిమం 70కోట్లు లేనిదే స్టార్ సినిమా రూపొందడం లేదు. 80 నుంచి 120కోట్ల మధ్య బిజినెస్ జరుగుతోంది. ఇంత భారీ బిజినెస్ ను రాబట్టాలంటే.. మామూలు రోజుల్లో రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. వీకెండ్ రెండు రోజుల కలెక్షన్స్ బాగున్నా.. సోమవారం నుంచి వసూళ్లు పడిపోతున్నాయి. అందుకే పదిరోజుల పాటు సెలవులు ఉండే దసరా.. సంక్రాంతి పండుగలను.. లేదంటే రెండు నెలల పాటు హాలిడేస్ ఉండే సమ్మర్ నే నమ్ముకున్నారు మన స్టార్ హీరోలు. 

 

మనస్టార్స్ అందరి టార్గెట్ సెలవులే.. భారీ బిజినెస్ ను రాబట్టాలంటే.. మినిమం 10రోజులు సెలవులు ఉండాల్సిందే. ఇదే ఫార్ములాతో 90కోట్లు బిజినెస్ జరుపుకున్న అరవింద సమేత వీర రాఘవ దసరాకు వచ్చి సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. సైరా సినిమా గతేడాది దసరాకు రాకపోతే భారీ నష్టాలు చూసేది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన సైరా తెలుగులో తప్ప అన్ని భాషల్లో ఫ్లాప్ అయింది. తెలుగులో 100కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుంది. ఇంత మొత్తం రాబడుతుందా.. అనే డౌట్ ను దసరా హాలిడేస్ తీర్చేశాయి. సెలవుల్లో రాకుండా ఉంటే మాత్రం తెలుగులో కూడా ఫ్లాప్ అయ్యేదని ట్రేడ్ వర్గాలు భావించాయి. 

సెలవులు కాకుండా.. మామూలు రోజుల్లో వచ్చి నష్టపోయిన చిత్రం సాహో. 2019 ఆగస్ట్ 30న రిలీజైన సాహో డిజాస్టర్ టాక్ వచ్చినా.. వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వర్కింగ్ డేస్ కావడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. సెలవుల్లో వస్తే.. నష్టాలు తగ్గేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 

 

భారీ కాస్టింగ్.. భారీ బడ్జెట్.. భారీ బిజినెస్. తెలుగు సినిమా పరిస్థితి ప్రస్తుతం అంతా భారీ లెవల్లో సాగుతోంది. ఇలాంటి సినిమాలకు ఒకటి రెండు రోజులు సెలవులు సరిపోవు. మినిమం 10రోజులు కావాలి. అందుకే స్టార్స్ సినిమాలు మొదలుపెట్టకుండానే.. సంక్రాంతి.. దసరా.. సమ్మర్ హాలిడేస్ పై కర్చీఫ్ వేస్తున్నారు. 

 

ట్రిపుల్ ఆర్ జులై 30న రిలీజ్ అని ముందుగా ఎనౌన్స్ చేశారు. సినిమా ఆలస్యం కావడమనే రీజన్ పక్కన పెడితే.. రిలీజ్ కు జులై అన్ సీజన్. 500కోట్లతో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సెలవులు లేకుండా రిలీజ్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు భయపడ్డాయి. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో బాక్సాఫీస్ ను దోచేయడంతో.. ట్రిపుల్ ఆర్ ను 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని ఎనౌన్స్ చేశారు. 

 

సాహో హాలిడేస్ లేని టైమ్ లో వచ్చి దెబ్బ తినడంతో.. ప్రభాస్ తన కొత్త సినిమా రిలీజ్ కు దసరాను వేదిక చేసుకున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఎట్టకేలకు దసరాకు ముహూర్తం పెట్టారు.

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ నటించే మూవీపై క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చకపోవడంతో.. గీత గోవిందం ఫేం పరశురామ్ కు ఛాన్స్ ఇచ్చాడని సమాచారం. ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా.. సమ్మర్ కు రిలీజయ్యేలా ప్లాన్ చేశాడని మహేశ్ సూచించాడట. సంక్రాంతి.. దసరా.. సమ్మర్ లో వస్తేనే.. పెద్ద సినిమాలు హిట్ అవుతాయని కాదు. ఒకవేళ సినిమా హిట్ అయినా.. ఆడియన్స్ కు హాలిడేస్ లో మెయిన్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈ క్రమంలో నష్టాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: