నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోలుగా ఇప్పటికే జూనీయర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ లు ఓ రేంజ్‌లో సత్తా  చాటుతున్నారు. అయితే చాలా కాలంగా బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా త్వరలోనే వారసుడి తెరంగేట్రం అంటూ పలువేదిక మీద ప్రకటించి అభిమానులను ఊరిస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఈ చర్చ జరుగుతున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఓ గాసిప్‌ గానే మిగిలిపోయింది.

 

ముఖ్యంగా బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌ సమయంలో మోక్షజ్ఞ ఎంట్రీ పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య చిన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఖాయం అని అంతా భావించారు. కానీ దర్శకుడు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ మరో ఏడాది వారసుడి ఎంట్రీ ఖాయం అంటూ మరోసారి అభిమానులకు ఆశలు కలిగించాడు.

 

మోక్షజ్ఞను తెరకు పరిచయం చేసే బాద్యతను మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తీసుకున్నారని ఒకసారి, కాదు విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్‌ పరిచయం చేయబోతున్నాడని మరోసారి వార్తలు వినిపించాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇటీవల బయటకు వచ్చిన మోక్షజ్ఞ ఫోటోలు ఆయన తెరంగేట్రంపై మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. తాజా ఫోటోల్లో బాలయ్య తనయుడు భారీ ఖాయంతో కనిపిస్తున్నాడు. దీంతో మోక్షజ్ఞ ఇప్పట్లో హీరోగా పరిచయం అయ్యే అవకాశమే లేదని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక తనయుడు సినిమా చేసేందుకు మీన మేషాలు లెక్కపెడుతుంటే ఈ వయసులోనూ బాలయ్య మాత్రం జెట్ స్పీడుతో సినిమాలు చేసేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: