బాహుబలి సినిమా సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోయాయి. అప్పటి వరకు రీజినల్‌ సినిమాగా మాత్రమే ఉన్న తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది బాహుబలి. ఈ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ కూడా భారీగా పెరిగింది. బాహుబలి ఇచ్చిన జోష్‌తో టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్‌ సినిమాలను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చారు. బాలీవుడ్‌లోనూ తెలుగు సినిమాకు భారీ మార్కెట్ క్రియేట్ అయ్యింది.

 

ఆ ధైర్యంతోనే బాహుబలి రిలీజ్‌ అయిన కొద్ది రోజులకే ఓ భారీ చిత్రాన్ని ప్రకటించాడు అల్లు అరవింద్‌. పౌరాణిక గాథ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా భారతీయ భాషలన్నింటిలో రామాయణాన్ని నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు ఎవరు..? ఎప్పుడు మొదలవుతుంది లాంటి అంశాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో మెగా రామాయణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ నటిస్తున్నాడన్న వార్త మెగా అభిమానుల్లో జోష్‌ నింపింది. ఈ సినిమాతో రామ్ చరణ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారుతాడని భావించారు ఫ్యాన్స్‌. అయితే ఈ లోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ప్రకటన వచ్చింది. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్‌ ఏడాదిన్నరకు పైగా డేట్స్‌ కేటాయించటంతో రామాయణం ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లిపోయింది.

 

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఆర్‌ ఆర్ ఆర్‌ సినిమా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ భామ ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: