నటనలోనే కాదు.. వివాదాల్లో కూడా విలక్షణ నటుడికి వారసురాలినని మరోసారి నిరూపించుకుంది కమల్ గారాలపట్టీ శృతి హాస‌న్. నా జీవితం నా ఇష్టమంటూ ట్వీట్ చేసింది. అసలెందుకు ఆ ట్వీట్ చేసిందామె..? 

 

శృతి హాసన్.. తెలుగు, త‌మిళ ప్రేక్షకుల‌కి చాలా సుప‌రిచితమైన నటి. గ‌బ్బర్ సింగ్ చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మడు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది అంతగా సినిమాలు లేని ఈ అమ్మడు.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగులో గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న క్రాక్ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తోంది. అలానే.. రెండు త‌మిళ చిత్రాల్లో కూడా చేస్తోంది. 

 

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బామ ఎప్పుడు ఫోటోస్‌ తీసుకున్నా.. వెంటనే వాటిని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా శృతి పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. అంద‌విహీనంగా, బ‌క్కగా కనిపిస్తుండ‌డంతో.. రకరకాల కామెంట్స్ చేశారు నెటిజన్స్. 

 

నెటిజ‌న్స్ కామెంట్స్‌పై శృతి కాస్త ఘాటుగా స్పందించింది. గతంలో తాను ప్లాస్టిక్ స‌ర్జరీ చేయించుకున్న విష‌యాన్ని గుర్తు చేసుకుంది. ఈ పోస్ట్ చేయడం వెనుక ఓ అర్థముందంటూ స్టార్ట్ చేసిన ఆమె.. ఒకరి అభిప్రాయాలకి తగ్గట్టు నడుచుకోవలసిన అవసరం లేదని మండిపడింది. ఒకప్పుడు లావుగా ఉండేది, ఇప్పుడు సన్నబడ్దది అంటూ కామెంట్స్ చేయడం సరైనది కాదంటూ క్లాస్‌ తీసుకుంది. 

 

ప్రస్తుతం తాను పోస్ట్‌ చేసిన ఫోటోలు రీసెంట్‌గా తీసుకున్నవని.. ప్రతీ మహిళ మాదిరిగానే.. హార్మోన్ల కారణంగా శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో కష్టపడుతున్నానని, శారీరక మార్పుల వెనుక కష్టం మాములుగా ఉండదని తెలిపింది. ఒకరి జీవితం గురించి వేరేవారు నిర్ణయించలేరని, ఇది నా జీవితం.. నా ముఖం.. ఈ విషయం చెప్పడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్. 

 

ఆ సందర్భంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా తెలిపింది. ఈ విషయం ఎప్పుడైనా చెప్పానా..? ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ... తాను ఎలా జీవించాలని అనుకుంటానో అలానే జీవిస్తానని, మనకు మనం చేసుకునే మంచి ఏదైనా ఉంది అంటే, మన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవడమే అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం నిత్యం తనను తాను ప్రేమించడం నేర్చుకుంటున్నానని, అందరూ అలాగే చేయండని పోస్ట్‌ చేసింది శృతి. ప్రేమని పంచండి అని కూడా  సందేశమిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: