టాలీవుడ్ లో శివపుత్రుడు సినిమాతో ప్రయోగాలకు పునాది వేశాడు.. చియాన్ విక్రమ్. తెలుగు లో కెరీర్ ప్రారంభించినప్పటికీ ఇక్కడ సక్సెస్ సాధించలేకపోయాడు. తమిళంలోకి వెళ్లిన ఆయన అక్కడ వరుస హిట్స్ సాధిస్తూ వచ్చాడు. శివ పుత్రుడు తర్వాత అపరిచితుడు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇలా వరుసగా విక్రమ్ నటిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభించింది. గతంలో కమల్ హాసన్ మాత్రమే ఎలాంటి ప్రయోగాత్మక పాత్రల్లో అయినా సూట్ అయ్యేవారు. ఆ తర్వాత విక్రమ్ లాంటి హీరోలు ఆయన బాటలో నడిచారు. ఇక పాత్రల ప్రయోగాల విషయంలో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, మోహన్‌లాల్ తర్వాత స్థానంలో విక్రమ్ నిలుస్తారు. శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ సినిమా కోసం ఏకంగా తన ఆరోగ్యాన్నే రిస్క్ లో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
వైవిధ్యమైన పాత్రల్లో విభిన్న గెటప్ల్లో కనిపించడం ఆయనకే సొంతం. తాజాగా ఇప్పుడు విక్రమ్ మరో ప్రయోగానికి సిద్దమవుతున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘కోబ్రా’. శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.. ఈ పోస్టర్ లో విక్రమ్ ఏడు రకాల పాత్రల్లో కనిపిస్తున్నాడు. అప్పట్లో కమల్ హాసన్ దశావతారంలో పది రకాల పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. వివిధ గెటప్‌లలో కనిపించడం విక్రమ్‌కు కొత్తేమీ కాదు. కానీ, గతంలో ఎన్నడూ కనిపించని గెటప్‌లలో ‘కోబ్రా’లో కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా వేసవి కానుకగా మేలో విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ ఈ మూవీ సంగీతం అందిస్తున్నారు. ‘కోబ్రా’ఫస్ట్‌లుక్‌కు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఆయన పడే కష్టానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మొత్తానికి అప్పట్లో కమల్ హాసన్ చేసిన ప్రయోగం ఇప్పుడు విక్రమ్ చేయడం.. అందులోనూ ఏడు పాత్రల్లో నటించడం సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.