సినిమా నటులు రాజకీయాల్లోకి రావడమనేది ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి, అమితాబ్ బచ్చన్, కృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, కమల్ హాసన్.. ఇలా వీరంతా సినిమాల్లో స్టార్ డమ్ అనుభవించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చినవారే. ప్రస్తుతం తమిళనాడులో రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై తమిళ సీనియర్ దర్శకుడు సౌందరరాజన్ స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం అనవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

‘ఎమ్జీఆర్ ను చూసి అందరూ రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్, విజయ్ లాంటి వాళ్లు ఇందుకు అర్హులు కారు. అన్నాదురై సీఎం కావటానికి ముందు ఆయన ఓ టీచర్. దీంతో ఆయన సీఎం అయినప్పుడు టీచర్లు సంతోషించారు. ఎమ్జీఆర్ సీఎం అయ్యాక సినిమా వాళ్లకు సీఎం పదవిపై ఆశ పుడుతోంది. ఎమ్జీఆర్ కు ఉన్న శక్తి వీరెవరికీ లేదు.. రాజకీయాల్లోకి రావడం అనవసరం. పైగా.. రజినీకాంత్ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. ఈ సమయంలో ఆయన రాజకీయాల్లోకి రావడం అనవసరం. ఒకవేళ వస్తే కోయంబత్తూరులో తొలి మీటింగ్ పెట్టి తిర్పూర్ వచ్చేలోపే మరణిస్తారు. రజినీకాంత్, విజయ్, అజిత్ లకు ఎమ్జీఆర్ లా రాజు వేషం వేస్తే పగటి వేషగాళ్లలా ఉంటారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతి వేడుకల్లో సౌందరరాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రజినీకాంత్ అభిమానులైతే సౌందరరాజన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటివల రజినీకాంత్ రాజకీయంగా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాదాపు ప్రతి అంశంపై స్పందిస్తున్నారు. త్వరలోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. దీంతో సౌందరరాజన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఆయన రజినీ స్పందనేంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: