దిల్ రాజు నిర్మాతగా సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన జాను సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో క్లాసిక్ అనిపించుకున్న 96 సినిమాకు రీమేక్ గా జాను తెరకెక్కింది. కానీ జాను సినిమా విడుదలకు ముందే 96 సినిమాను చాలా మంది చూసేయటం, ఒరిజినల్ కు జానుకు పెద్దగా మార్పులు లేకపోవడంతో హిట్ టాక్ వచ్చినా జాను కలెక్షన్లపరంగా డిజాస్టర్ అనిపించుకుంది. 
 
జాను సినిమా ఫలితం తరువాత శర్వానంద్ దిల్ రాజును బాగా తిట్టుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదట్లో శర్వానంద్ ఇలాంటి క్లాసిక్ సినిమాలో నటించటం ఇష్టం లేదని దిల్ రాజు దగ్గర సందేహాలు వ్యక్తం చేశాడు. కానీ దిల్ రాజు శర్వానంద్ ను ఒప్పించడంతో ఇష్టం లేకపోయినా శర్వానంద్ ఒప్పుకున్నాడని సమాచారం. జాను కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మి మోసపోయానని శర్వానంద్ సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది. 
 
శర్వానంద్ నటించిన చివరి మూడు చిత్రాలు రణరంగం, పడి పడి లేచే మనసు, జాను ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. సినిమా సినిమాకు శర్వానంద్ మార్కెట్ కూడా తగ్గుతోంది. ఇతర హీరోలలా హిందీ మార్కెట్ లేకపోవడం శర్వాకు మైనస్ గా మారింది. శర్వానంద్ సినిమాలకు థియేటర్లు, శాటిలైట్ రైట్స్ ద్వారా ఆదాయం రావాలి తప్ప బయటి నుండి వచ్చే ఆదాయం అంతగా ఉండదు. 
 
శర్వా నటించిన సినిమాలకు రిలీజ్ కు ముందు హైప్ వస్తున్నా ఆ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రావడం లేదు. నిర్మాతలు ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలకు హిందీ మార్కెట్ ఉండటంతో వారితో సినిమాలు తీయడానికే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో శ్రీకారం సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమా హిట్టైతే మాత్రమే శర్వానంద్ కు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం శర్వాకు ఇప్పట్లో మరో అవకాశం రావడం కష్టమే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: