బాహుబలి తరువాత అదే స్థాయిలో ఘన విజయం సాధించిన సౌత్‌ సినిమా కేజీఎఫ్‌. యష్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘనవిజయమం సాధించింది. దీంతో ఈ సినిమా హీరో యష్‌ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు సౌత్‌ స్టార్‌ హీరోలు క్యూ కట్టారు.

 

తొలి భాగం ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఈ సినిమాను సీక్వెల్‌ ను తెరకెక్కించే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. ఇప్పటికే కేజీఎఫ్‌ 2 చిత్రీకరణ చాలా వరకు పూర్తయ్యింది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌ బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ రవీనా టండన్ నటిస్తోంది. తెలుగు నుంచి విలక్షణ నటుడు రావూ రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

అయితే ఈ సినిమా నటుడు యష్‌ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఓ విన్నపం చేశాడు. ఇన్నాళ్లు కన్నడ ఇండస్ట్రీని ఓ చిన్న పరిశ్రమగా భావించేవారు. కథా కథనాల పరంగా కూడా సాండల్‌వుడ్‌ చాలా వెనుకపడి ఉండేంది. నిర్మాణ వ్యయం పరంగా కన్నడ చిత్రాలు పెద్దగా ఆకట్టుకునే స్దాయిలో లేవు. అయితే కేజీఎఫ్‌ తో సీన్‌ మారిపోయింది. కన్నడ సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే నిర్మాణానికి కావాల్సిన సాంకేతికత స్టూడియోలు మాత్రం ఇంకా అక్కడి వారికి అందుబాటులో లేవు. అందుకే కర్ణాటకలోనే ఓ స్టూడియో ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని హీరో యష్‌ ప్రభుత్వాన్ని కోరాడు. మరి యష్ విన్నపానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: