టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అప్పట్లో వచ్చిన ఎందరో కామెడియన్లలో కొందరు మంచి పేరుతో, అలానే వరుసగా అవకాశాలతో దూసుకెళితే, అక్కడక్కడా మరికొందరు మాత్రం రాను రాను సరైన అవకాశాలు లేక ఆర్ధికంగా సరైన పోషణ లేక, అనారోగ్యం పాలై మరణించిన వారున్నారు. అయితే ఆ విధంగా చివరి దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో టాలీవుడ్ కమెడియన్ ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన గునుపూడి విశ్వనాథ శాస్త్రి స్వతహాగా అక్కడ మంచి పేరున్న పురోహితుడు. అయితే ఒకానొక సందర్భంలో టాలీవుడ్ హాస్య దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఆయనలోని హాస్య చతురతను గమనించి ఆయనను తాను అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ తో తీసిన అప్పుల అప్పారావు సినిమాతో కమెడియన్ గా పరిచయం చేసారు. 

 

అయితే ఆ సినిమాలో ఆయన ఐరన్ లెగ్ గా పండించిన కామెడీ కి మంచి మార్కులు పడడంతో పాటు, తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఆయన పేరు అక్కడి నుండి ఐరన్ లెగ్ శాస్త్రిగా స్థిరపడిపొయింది. ఇక ఎక్కువగా ఆయనకు సినిమాల్లో పురోహితుడి అవకాశాలే దక్కేవి, అయినప్పటికీ ఆయన తనకు వచ్చిన అవకాశాలు బాగా వినియోగించుకుని ముందుకు సాగారు. అయితే రాను రాను పూర్తిగా అవకాశాలు తగ్గడం, అలానే కుటుంబ సమస్యలు పెరగడంతో శాస్త్రి మానసికంగా కూడా కృంగిపోయారు. ఇక ఒకానొక సమయంలో ఇక్కడ ఉంటె తనకు పెద్దగా ఉపయోగం లేదని భావించి, టాలీవుడ్ విడిచి తన స్వగ్రామానికి వెళ్ళిపోయి పౌరోహిత్యం ప్రారంభించారు. కానీ అక్కడి నుండి ఆయనకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో పాటు, ఊబకాయంతో పాటు వయసు మీద పడుతుండడంతో ఆయనకు పలు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. 

 

అయినప్పటికీ ఎలాగో వాటిని తట్టుకుని ముందుకు సాగిన శాస్త్రి 2006లో గుండెకు సంబంధిత వ్యాధికి గురయ్యారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు, తమను ఆర్థికంగా ఆదుకోమని అప్పట్లో ప్రభుత్వాన్ని అర్థించారు. వారి కుటుంబ పరిస్థితిని గమనించిన కొందరు సినిమా నటులు కొంత మొత్తాన్ని వారికి సాయం అందించడం జరిగింది. ఇక ఆ తరువాత ఒకానొక సమయంలో ఆయనకు పచ్చ కామెర్లు కూడా సోకడంతో ఆయన పరిస్థితి మరింతగా విషమించి, ఆఖరుకి జూన్ 19, 2006లో తన స్వస్థలం తాడేపల్లి గూడెంలోనే ఐరన్ లెగ్ శాస్త్రి మరణించారు. అయితే శాస్త్రి చివరి రోజులు తలుచుకుంటే గుండె తరుక్కు పోతుందని ఇప్పటికీ కొందరు సినిమా ప్రముఖులు గుర్తు చేసుకుంటుంటారు. ఇక ఇటీవల ఆయన తనయుడు ప్రసాద్, జంబ లకిడి పంబ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించడం జరిగింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: