కొన్ని సినిమాల్లోని పాత్రలు.. వాటిని పోషించే నటులకు ఎనలేని కీర్తిని తెచ్చిపెడుతూంటాయి. దాంతో వారి కెరీర్ ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూంటుంది. ప్రేక్షకుల గుండెల్లో వారికి సుస్థిర స్థానం కల్పిస్తాయి. అలాంటి పాత్రలెన్నో తెలుగు తెరపై వెలిగాయి. అటువంటి గొప్ప పాత్రల్లో నటించిన వారిలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ఉంటారు. వారిద్దరికీ ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిన పాత్రలు గురించి చెప్పాలంటే అహనా పెళ్లంట సినిమా గురించే చెప్పుకోవాలి. అరగుండు బ్రహ్మానందం పాత్రలో బ్రహ్మానందం.. పిసినారి లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావు ఆయా పాత్రల్లో జీవించారనే చెప్పాలి.

 

 

నిజానికి మొదట వీరిద్దరి పాత్రలకు.. కోట శ్రీనివాసరావు పాత్రలో రావుగోపాల రావును, బ్రహ్మానందం పాత్రలో సుత్తివేలును తీసుకోవాలని నిర్మాత డి.రామానాయుడు పట్టుబట్టారట. అయితే అప్పటికే కామెడీలో రొటీన్ గా వారిని చూస్తున్న ప్రేక్షకులకు కొత్తగా వేరొకరిని చూపాలని దర్శకుడు జంధ్యాల ఆలోచన. దీంతో తీవ్ర తర్జనభర్జనల అనంతరం కోట శ్రీనివాసరావును, బ్రహ్మానందంను ఎంపిక చేశారు. నిజానికి సుత్తివేలును ఆపాత్రకు దాదాపు ఖాయం చేయగా షూటింగ్ టైమ్ కి అప్పటికే బిజీ ఆర్టిస్ట్ అయిన సుత్తివేలు అందుబాటులో లేకపోయారట. దీంతో అత్తిలిలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న బ్రహ్మానందంను పిలిపించారు. ఇందుకు జంధ్యాల వద్ద కోడైరక్టర్ గా చేస్తున్న ఈవీవీ సత్యనారాయణ సహకరించారట.

 

 

వీరితో సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విడుదల కావటం కూడా జరిగిపోయాయి. 1987లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ వాల్యూను మరింత పెంచింది ఆ సినిమా. రాజేంద్రప్రసాద్ కు భారీ హిట్ అందిస్తే.. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కెరీర్ కు బూస్టప్ ను ఇచ్చింది ఈ సినిమా. వీరిద్దరూ తమ కెరీర్లో ఇప్పటి వరకూ వెనుదిరిగి చూడకుండా శిఖరాలను చేరుకున్నారంటే ఈ రెండు పాత్రల్లో జీవించడమే కారణం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: