హీరో ఇమేజ్‌ లేకపోయినా హీరో స్థాయిలో సినిమాలు కాపాడగల కమెడియన్స్‌ తెలుగులో ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా కొన్ని పాత్రలు వీళ్లు మాత్రమే చేయగలరు అనిపించుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి  అరుదైన నటుడే ఎంఎస్‌ నారాయణ. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఎంఎస్‌ తన ఖాతాలో మరో అరుదైన రికార్డ్‌ను కూడా వేసుకున్నాడు. 2015 జనవరిలో ఎంఎస్‌ నారాయణ తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణించిన తరువాత కూడా ఆయన చేసిన దాదాపు 10 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. కొన్ని సినిమాల దర్శక నిర్మాతలు ఆయన మీద గౌరవంతో ఆయన పాత్రకు మిమిక్రీ ఆర్టిస్ట్‌లతో డబ్బింగ్ చెప్పించి మరీ కంటిన్యూ చేశారు. ఇలా ఓ నటుడు మరణించిన తరువాత ఆయన నటించిన 10కి పైగా సినిమాలు రిలీజ్‌ అవ్వటం అనేది ఓ అరుదైన రికార్డ్‌.


ఎంఎస్‌ నారాయణ.. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో 1951 ఏప్రిల్ 16న జన్మించారు. మోహన్‌ బాబు హీరోగా తెరకెక్కిన ఎం. ధర్మరాజు ఎం.ఎ చిత్రం ద్వారా నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన దాదాపు 700పైగా చిత్రాల్లో నటించారు. రుక్మిణి, పెదరాయుడు, ఒట్టేసి చెబుతున్నా, సొంతం, దిల్, దుబాయ్ శీను, శశిరేఖా పరిణయం, దూకుడు.. వంటి చిత్రాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తనయుడు విక్రమ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ, తొలి ప్రయత్నంగా ఆయన కొడుకు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.  

 

సినీరంగానికి రాకముందు ఎక్కువ కాలం భీమవరంలోనే గడిపారు. భీమవరం ఏఆర్‌కేఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఎం.ఎస్. నారాయణ 1978 అక్టోబర్ 30న కేజీఆర్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి 23 ఏళ్లపాటు అందులో పనిచేశారు. ఆయన పాఠం చెబుతుంటే.. ఇతర తరగతుల విద్యార్థులంతా ఆ తరగతికి వెళ్లి మరీ ఎమ్మెస్ పాఠాలను వినేవారట. హాస్యం జోడించి ఆయన పాఠాలు చెప్పే విధానం విద్యార్థుల్ని అలరించేది. లెక్చరర్‌గా పనిచేస్తూ పలు నాటకాలు రచించి విద్యార్థులతో వేయించారు. ఆంధ్రా యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన నాటక పోటీల్లో ఆయన రచించి, దర్శకత్వం వహించిన రెండు రెళ్లు ఆరు నాటకానికి 8 బహుమతులు వచ్చారు. ఇలా బహుముఖ ప్రజ్క్షాశాలి అనిపించుకున్నారు ఎంఎస్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: