తమ అభిమాన కథానాయకుడి సినిమా కోసం ఎదురుచూసే అభిమానుల ఆరాటం ఎలా ఉంటుందంటే ‘ఆకలితో వేటాడే పులి’లా ఉంటుంది అనాలేమో. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అభిమానుల ఆరాటం చూస్తే ఈ మాటే కరెక్ట్ అనిపిస్తుంది. రెండేళ్లుగా తమ అభిమాన కథనాయకుడిని తెర మీద చూసుకోలేని వారి ఆవేదనను తీరుస్తూ పవన్ సినిమా చేయడం ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ బయటకి రావడం జరిగిపోయింది. ఇంకేముంది.. గేట్లు ఎత్తేసిన డ్యామ్ లా ఉంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పరిస్థితి.

 

 

వకీల్ సాబ్ అనే టైటిల్ తో పవన్ కల్యాణ్ మార్క్ స్టిల్ తో వచ్చిన పోస్టర్ ను చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సందడి చూస్తే పై రెండు మాటలు కూడా చాలవేమో. కేక్ కటింగ్ లు, బాణా సంచా, పోస్టర్ కు పాలాభిషేకాలు, పెద్ద పెద్ద బ్యానర్లు, అరచేతిలో హారతులు.. ఇలా ఒకటేమిటి పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన హడావిడి ఇప్పటి వరకూ మరే హీరోకు వారి అభిమానులు చేసి ఉండరు. ఫస్ట్ లుక్ వదిలిన పది నిముషాల్లోనే ఫ్లెక్సిలు వెలిసాయి.. ఆటోలపై ప్రింటింగ్ లు పడ్డాయి.. బైక్ లపై స్టిక్కర్లు ఎక్కేసాయి. కేవలం పోస్టర్ కే ఇంత హడావిడి చేస్తే రేపు సినిమా విడుదలకు ఇంకెంత హడావిడి చేస్తారో అని సోషల్ మీడియాలో కామెంట్లు పెరిగిపోయాయి.

 

 

ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ నినాదం ఏంటంటే.. ‘అమ్మా మే నెల.. త్వరగా వచ్చేయమ్మా..’ అనే నినాదంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సినీ సెలబ్రిటీలు సైతం పవన్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు. రెండేళ్లు గ్యాప్ వచ్చినా పవన్ లో స్టైల్ ఇసుమంతైనా మారలేదని అంటున్నారు. దీంతో మేనెల కోసం పవన్ అభిమానులతో పాటు, ఇండస్ట్రీ అంతా పవన్ మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: