తెలుగు సినిమా తెర మీద గయ్యాళీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌ ఆమె. వెటకారం, మూతి విరుపులు, సూటి పోటి మాటలతో ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టే పాత్రల్లో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. గుండమ్మ కథలో గుండమ్మగా గుబులు పుట్టించినా....మాయాబజారులో హిడింబిగా మెప్పించిన అది సూర్యాకాంతంకు మాత్రమే సాధ్యం అనేలా చేసింది. ఆమె తెలుగు జనాల్లో వేసిన ముద్ర ఎలాంటిదంటే గయ్యాళీ నోరున్న ప్రతీ ఒక్కరినీ సూర్య కాంతం అని పిలించేంతగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేశారు సూర్యకాంతం.


సూర్యకాంతం... తెలుగువారిని భయపెట్టిన పేరది. ఇంత పేరు తెచ్చుకున్న నటి దేశంలోనే మరొకరు లేకపోవటం విశేషం.గయ్యాలి పాత్రలు అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తుకువచ్చే పేరు సూర్యకాంతం. తెరపై ఆమె పోషించిన ప్రతి పాత్రలో కామెడీ, వెటకారం, వ్యంగ్యం, చిలిపితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పాత్ర ఏదైన అందులో తనదైన ముద్ర కనిపించేలా నటించడం ఆమెకు నటనతో పెట్టిన విద్య.


మహానటి 1924 అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరావు పురంలో జన్మించారు. చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యం లో మంచి పట్టు సంపాదించిన సూర్యకాంతం...ఆ తర్వాత నటిగానూ సత్తా చాటారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో నారద నారదీ, గృహ ప్రవేశం లాంటి సినిమాలో అవకాశం వచ్చిన నటిగా సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత సౌదామిని అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది.  సంసారం ఆమె నట జీవితాన్నే మలుపు తిప్పింది. ఈ సినిమాలో గయ్యాళి అత్త పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు సూర్యకాంతం. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు జనాల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత వెండితెర అత్తగా సూర్యకాంతం  వెనుదిరిగి చూసుకోలేదు.

 

సూర్యకాంతం అభినయ చాతుర్యం ముందు మహానటులు కూడా వెలవెల బోయేవారు. మహానటి సావిత్రి, జమున వంటి ఎంతో మంది నటీమణులు కూడా సూర్యకాంతం చేతిలో చీపురు, గరిట దెబ్బలు,శాపనార్థాలు తిన్నవారే. అయితే సినిమాల్లో ఎంత గయ్యాలి పాత్రల్లో నటిస్తారో నిజ జీవితంలో అంతే సహృదయం కలిగిన వ్యక్తి సూర్యకాంతం

మరింత సమాచారం తెలుసుకోండి: