కరోనా మహమ్మారి.... భయంకరమైన కరోనా.... ప్రమాదకరమైన కరోనా అని అంటున్నావే....

 

అసలు ఎవడ్రా ప్రమాదకరం? ఏది భయంకరం? ఎవరు మహమ్మారి? 

 

నీ యమ్మ మొగుడి సొమ్ము అన్నట్లు విచ్చలవిడిగా ఇండస్ట్రీలు పెట్టి విషవాయువులతో స్వచ్చమైన గాలిని కలుషితం చేసిన నువ్వు ప్రమాదకరం కాదా....?

 

పసిడిని పండించే నేలతల్లికి లాభాల కోసం పురుగులకు రసాయన ఎరువులే పరిష్కారం అని మభ్యపెట్టి నిట్ట నిలువునా తన జీవాన్ని దోచుకునే నువ్వు చేస్తున్న పని భయంకరం కాదా....

 

అడ్డమైన తెలివితేటలు ఉపయోగించి నీ సౌకర్యం కోసం తయారు చేసుకున్న చెత్తనంతా జీవనాధారమైన నీటిలోనికి వదిలి కోట్ల జీవరాశులను చంపుతున్న నువ్వు మహమ్మారి కాదా? 

 

నువ్వంటే కోపాలు, అహాలు, స్వార్థాలు, కోరికలు, ఆధిపత్యం అంటూ నీతో నువ్వు యుద్ధం చేసుకునే ధైర్యం లేక పక్కనోడిపై దాడి చేస్తూ సర్వ నాశనమైపోతునావ్. ఇది చాలదన్నట్లు ఒక చిన్న కాగితం ముక్క (డబ్బు) కోసం వెంపర్లాడడమే జీవితానికి సార్థకత అన్నట్లు నువ్వు లేకున్నా హాయిగా బ్రతికే ఇతర ప్రాణులని హింసిస్తున్నావే....

నిన్ను ఈ రోజు అంతా పాపం అనాలా? 

 

కొండని వదలవ్.... తొండని వదలవ్!  
పురుగును వదలవ్ పసిడి మెరుగుని వదలవ్!
ఏ జీవచ్చరాలను వదలవ్.... వాటి తరాలను వదలవ్.... ఆఖరికి నీ మలాన్నీ వదలవ్! 

 

దేనిలో ఏముందో తెలుసుకోవాలి.... నీకు నచ్చింది వాడుకోవాలి.... వ్యర్థమైన దానిని ఇతర జీవుల హానికి వదిలేయాలి. 

 

నీ ఉన్మాదాన్ని తట్టుకోలేక అవి నిస్సహాయులై చనిపోతుంటే నీకు అదీ నచ్చదు. అంతరించిపోతున్నాయంటూ వాటికి ఉన్న ఒక్క స్వేచ్చనూ దూరం చేసి ఒక పంజరంలో బిగిస్తావు. అదీ వాటిపై జాలితో కాదు. నీ రేపటి తరాలకి జి.కె క్వశ్చన్ల కోసం. ఎంత కర్కశుడివిరా నువ్వు. 

 

నీ రాక్షసత్వాన్ని భరించలేక మనందరి అమ్మ సునామీ అంటూ, భూకంపం అంటూ, తుఫాను అంటూ, వరదలంటూ కొన్ని వందల సార్లు కన్నెర్ర చేసినా ఉపగ్రాహాల సాయంతో తన కొంగు చాటున తప్పించుకున్నావు. ఆ కొంగుతోనే తన మెడకు ఉచ్చుని బిగించి రోజూ కొద్ది కొద్దిగా ఊపిరితీస్తున్నావు. నన్ను ఎదిరించే వాడే లేడని సంబరపడుతున్నావ్.

 


కానీ ఒరేయ్.... నేను నీకు ఆహారంగా బలయ్యేందుకే పుట్టాను అని మొత్తుకుంటున్న మొక్కలను వదిలేసి.... నా బ్రతుకు నన్ను బ్రతకనీ అని వేడుకుంటున్న జంతువులను నీ అజ్ఞానంతో చంపి తింటున్న నీకు.... కళ్ళకు కూడా కనిపించని ఒక క్రిమి వచ్చి చేతులు కడుక్కో.... బయటకు తుమ్మకు… అనవసరమైన వాటిని ముట్టకు అని నీకు ఇష్టంలేని అతి ప్రాథమిక పనులను ఆజ్ఞాపిస్టూ ప్రాణభయంతో నీ నుంచి నిన్నే తరుముతూ నిన్ను తన బానిసను చేసుకుని నీ శరీరం లోపలే తాండవమాడుతుంది చూడు.... 

 

అది రా నీ స్థాయి....! అస్సలు నీ పేరుని ఒకరు ఉచ్చరించడానికైనా అనర్హుడివైన 'ఓ మనిషి'.

మరింత సమాచారం తెలుసుకోండి: